Tesla Cars: టెస్లా కార్లకు నిప్పు.. ఉగ్రవాద చర్య అంటున్న మస్క్
షోరూంలోని ఐదు కార్లకు నిప్పు అంటించిన దుండగులు;
అగ్రరాజ్యం అమెరికాలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా పై దాడులు కొనసాగుతున్నాయి. గత కొంత కాలంగా అమెరికా వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో టెస్లాపై స్థానికులు దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. షోరూమ్‌పై కాల్పులు, నిప్పంటించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా లాస్ వెగాస్‌లో ఉన్న టెస్లా షోరూంలోని ఐదు కార్లకు దుండగులు నిప్పంటించారు. ఈ ఘటనలో ఆ కార్లు మంటల్లో కాలి బూడిదయ్యాయి.
అంతేకాదు, ఓ కారుపై అభ్యంతరకర వ్యాఖ్యలతో స్ప్రే పెయింట్ చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. మరోవైపు కాన్సాస్ సిటీ లో రెండు టెస్లా సైబర్ ట్రక్కులను దుండగులు తగలబెట్టారు. దక్షిణ కొరోలినాలో టెస్లా ఛార్జింగ్ స్టేషన్‌కు నిప్పంటించే ప్రయత్నం కూడా జరిగింది. ఇలా వరుస ఘటనలతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈ ఘటనలపై టెస్లా బాస్ ఎలాన్ మస్క్ స్పందించారు. ఇది ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు. ఈ స్థాయిలో హింస చాలా పెద్ద తప్పని వ్యాఖ్యానించారు. తన సంస్థ కేవలం ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే తయారు చేస్తుందన్నారు. ఇలాంటి దాడులకు కారకులైన వారిని ఏమీ చేయలేదంటూ ఎక్స్‌లో రాసుకొచ్చారు. ఆయా ఘటనలపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, ట్రంప్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపట్టిన టెస్లా బాస్ ఎలాన్ మస్క్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ట్రంప్ ఏర్పాటు చేసిన డోజ్ శాఖ అధిపతిగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫెడరల్ ఉద్యోగుల తొలగింపుతో టెస్లాను బహిష్కరించాలంటూ అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పలుచోట్ల నిరసనకారులు విధ్వంసానికి పాల్పడుతున్నారు.