Texas: విజృంభిస్తున్న కార్చిచ్చు.. భారీగా నష్టం
60 కౌంటీల్లో విపత్తుగా ప్రకటన;
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రాన్ని కార్చిచ్చు కమ్మేసింది. సోమవారం మధ్యాహ్నం మొదలైన ఈ కార్చిచ్చుకు ఎండిపోయిన గడ్డి, గాలి తోడు కావడంతో చూస్తుండగానే మంటలు రెట్టింపయ్యాయి. ఈ కార్చిచ్చు కారణంగా అక్కడి ప్రభుత్వం పరిసరాల్లోని చాలా చిన్నచిన్న గ్రామాలను ఖాళీ చేయించింది. ఆ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబాట్ పరిస్థితిని సమీక్షించి 60 కౌంటీల్లో విపత్తుగా ప్రకటించారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఇద్దరు మహిళలు చనిపోయారు. టెక్సాస్ చరిత్రలో ఇదే అతిపెద్ద అగ్నిప్రమాద ఘటన. మంటలు ఇళ్లకు కూడా వ్యాపించడంతో 500కు పైగా నివాసాలు కాలి బూడిదయ్యాయి. ఈ మంటల కారణంగా పెద్ద సంఖ్యలో జంతువులు, వన్యప్రాణులు కూడా చనిపోయాయి.
దాదాపు 780 కిలోమీటర్ల పరిధిలోని 2,00,000 ఎకరాల్లో ఉన్న వృక్షాలను ఈ అగ్నికీలలు దహించివేశాయి. టెక్సాస్ ఏ అండ్ ఎం ఫారెస్ట్ సర్వీస్ ఈ కార్చిచ్చుకు కారణాలను మాత్రం వెల్లడించలేదు. రాష్ట్ర ఉత్తర భాగంలోని ఇరుగ్గా ఉండే ప్రాంతంలో ఈ అగ్ని వ్యాపించడంతో తీవ్రత కూడా ఎక్కువగానే ఉంది. రాష్ట్ర ప్రజలు తమ కార్యక్రమాలను తగ్గించుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని, ఆత్మీయులను రక్షించుకోవాలని గవర్నర్ అబాట్ సూచించారు.
వేర్వేరు ప్రాంతాల్లో మంటలు అంటుకున్నట్లు తమకు సమాచారం వచ్చిందని అధికారులు తెలిపారు. హెంప్‌హిల్, రాబర్ట్స్ కౌంటీ, కెనెడియన్ టౌన్ నివాస ప్రాంతాల్లోకి కూడా మంటలు వ్యాపించాయి. అమెరికాలో దాదాపు 11 మిలియన్ల మంది కార్చిచ్చు ముప్పునకు సమీపంలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. జాతీయ రహదారుల పక్కన కూడా అగ్నికీలలు ఎగసి పడుతుండటంతో వాటిని మూసివేశారు.
టెక్సాస్ నుంచి ఈ మంటలు ఓక్లాహామాకు పాకాయి. అక్కడ రెండు కౌంటీల్లో ఉంటున్న ప్రజలను ఇళ్లు ఖాళీ చేయాలని ప్రభుత్వం హెచ్చరించింది. రోజర్ మిల్స్, ఎల్లిస్ కౌంటీల్లోని ప్రజలను తరలిస్తున్నామని రాష్ట్ర ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ సిబ్బంది పేర్కొన్నారు. గతంలోనూ టెక్సాస్‌లో అడవి మంటలు చెలరేగాయి. 2006లో టెక్సాస్ అడవులలో మంటలు వ్యాపించాయి. అప్పుడు 1,400 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కాలి బూడదైంది. నాటి ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు.