Space Exploration : అంతర్థానానికి సిద్ధమైన బాహుబలి నక్షత్రం

Update: 2024-11-23 12:30 GMT

అనంత విశ్వంలో మన పాలపుంత అవతల ప్రస్తుతం మినుకుమినుకుమంటున్న అండాకార రూపంలోని ఓ బాహుబలి నక్షత్రం త్వరలో విస్ఫోటనం చెంది అంతర్థానం కానుంది. మన సూరీడు కన్నా దాదాపు 2వేల రెట్ల పెద్దదిగా ఉండే ఈ బాహుబలి నక్షత్రాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు 'బెహమోత్ స్టార్' (భీముడిలాంటి నక్షత్రం)గా పిలుస్తారు. వాస్తవానికి వారు ఈ భారీ నక్షత్రానికి డబ్ల్యుఓహెచ్ జి64 అని పేరు పెట్టారు. దీనిముందు మనం చూస్తున్న సూర్యుడు.. ఓ చిన్న తునకలా కన్పిస్తుంది. అయితే, ఆ భారీ నక్షత్రం చివరి దశకు చేరుకుంది. త్వరలో అది విస్ఫోటనం (సూపర్ నోవా) చెంది కనుమరుగు కానుంది. ఆ భారీ నక్షత్రాన్ని రెండు దశాబ్దాలుగా పరిశీలిస్తూ అధ్యయనం చేస్తున్న ఖగోళ శాస్త్రవేత్తల బృందం ఈ విషయాన్ని చెప్పింది. ప్రస్తుతం ఆ నక్షత్రం మరణశయ్యపై ఉన్నట్టేనని వారు తేల్చారు. ఒకప్పుడు ఇది ఎర్రగా భగభగలాడుతూ కన్పించేది. కానీ కొన్నేళ్లుగా దాని తేజస్సు తగ్గుతూ వస్తోంది. మనకు దాదాపు 1,60,000 కాంతి సంవత్సరాల దూరంలో ఆ బాహుబలి నక్షత్రం ఖగోళంలోని దక్షిణ అర్ధభాగంలో ఉన్న రెండు మరుగుజ్జు పాలపుంతల్లో ఉంది. 

Tags:    

Similar News