Israel: మారు వేషంలో వెళ్లి.. ఉగ్రవాదులను మట్టుబెట్టారు

వైద్యసిబ్బంది, పౌరుల వేషధారణలో ఆస్పత్రిలోకి చొరబడి..;

Update: 2024-01-31 05:15 GMT

వెస్ట్‌ బ్యాంక్‌ జెనిన్‌ పట్టణంలోని ఓ ఆస్పత్రిలోకి మహిళలు, డాక్టర్ల వేషధారణతో ప్రవేశించిన ఇజ్రాయెల్‌ భద్రతా బలగాలు అందులో ఉన్న ముగ్గురు మిలిటెంట్లను హతమార్చారు. ఈ ఘటనను పాలస్తీనా ఆరోగ్య శాఖ తీవ్రంగా ఖండించింది. ఐతే అక్టోబర్‌ 7 తరహా ఉగ్రదాడికి మిలిటెంట్లు ప్రణాళికలు రచించడం వల్లే వారిని హతమార్చినట్లు తమ చర్యను ఇజ్రాయెల్‌ సమర్థించుకుంది.

ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లోని ఓ ఆస్పత్రిలో నక్కి ఉన్న ముగ్గురు మిలిటెంట్లను హతమార్చడానికి ఇజ్రాయెల్‌ సైన్యం కొత్త వ్యూహం అనుసరించింది. మహిళలు, ఆస్పత్రి సిబ్బందిలా వేషధారణతో ఆస్పత్రిలోకి చొచ్చుకు వెళ్లిన ఇజ్రాయెల్‌ భద్రతా బలగాలు...అందులో ఉన్న ముగ్గురు పాలస్తీనా మిలిటెంట్లను హతమార్చారు. జెనిన్‌ పట్టణంలో ఉన్న ఇబ్న్ సినా ఆస్పత్రిలోని వార్డుల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఆస్పత్రిలో ఇజ్రాయెల్ సైనికులు కాల్పులు జరిపినట్లు పాలస్తీనా ఆరోగ్య శాఖ కూడా ధ్రువీకరించింది. ఇజ్రాయెల్‌ దాడులను తీవ్రంగా ఖండించింది. ఆస్పత్రుల్లో ఇలాంటి దాడులు చేయకుండా ఇజ్రాయెల్‌పై అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తీసుకురావాలని కోరింది.

ఐతే ఆస్పత్రిని మిలిటెంట్లు రక్షణ కవచంలా వాడుకుంటున్నారని ఇజ్రాయెల్‌ మిలటరీ వర్గాలు ఆరోపించాయి. ఇజ్రాయెల్‌పై అక్టోబర్‌ 7 తరహా ఉగ్రదాడులకు ప్రణాళికలు రచించడం, ఆయుధాల రవాణా వంటి వాటికి పాల్పడిన వారిని హతమార్చినట్లు తెలిపాయి. మహిళలు, డాక్టర్లు, ఆస్పత్రి సిబ్బంది మాదిరిగా వస్త్రధారణతో ఇజ్రాయెల్‌ సైనికులు ఆస్పత్రిలోనికి వెళ్తున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సర్జికల్‌ మాస్క్‌ వేసుకున్న ఓ సైనికుడు... ఒక చేతిలో ఆయుధం మరో చేతిలో వీల్‌ఛైర్‌ పట్టుకుని వెళ్తున్నట్లు అందులో ఉంది.

గాజాలో ఆస్పత్రులపై దాడుల విషయంలో ఇప్పటికే ఇజ్రాయెల్‌ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. చాలా ఆస్పత్రులు శరణార్థ శిబిరాలుగా పని చేస్తున్నాయి. ఇజ్రాయెల్‌ దాడుల కారణంగా గాజాలో అనేక ఆస్పత్రులు ఇప్పటికే మూతపడగా పని చేస్తున్న కొన్ని ఆస్పత్రుల్లో కూడా ఇంధన, ఔషధాల కొరత నెలకొంది. 

Tags:    

Similar News