Russia Ukraine War నాలుగో ఏట అడుగుపెట్టిన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం

కొనసాగుతున్న ప్రతిష్ఠంభన.. 20 శాతం భూభాగం రష్యా ఆధీనంలో

Update: 2026-02-25 02:30 GMT

రష్యా–ఉక్రెయిన్ మధ్య సాగుతున్న ఘర్షణకు మంగళవారం నాటికి మూడేళ్లు పూర్తయ్యాయి. 2022లో ప్రారంభమైన ఈ యుద్ధం ఇప్పుడు నాలుగో ఏడాదిలోకి ప్రవేశించింది. ముగింపు దిశ స్పష్టంగా కనిపించకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, ఆర్థిక రంగాల్లో అనిశ్చితి నెలకొంటోంది. ఇది ప్రపంచ సమాజం మీద మిగిలిన గాయం లాంటిదని, అంతర్జాతీయ శాంతి భద్రతలకు సవాలుగా మారిందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ వ్యాఖ్యానించారు.

ఈ మూడు సంవత్సరాల్లో భారీ ప్రాణనష్టం సంభవించింది. ఉక్రెయిన్ పౌరుల్లో 15 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు, సుమారు 41 వేల మంది గాయపడ్డట్లు నివేదికలు చెబుతున్నాయి. చిన్నారుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. దాదాపు 660 మంది పిల్లలు మరణించగా, ప్రతి ముగ్గురు చిన్నారుల్లో ఒకరు నివాసం కోల్పోయినట్టుగా అంచనా. అంతర్జాతీయ విశ్లేషణల ప్రకారం రష్యా సైన్యంలో సుమారు 3.25 లక్షల మంది, ఉక్రెయిన్ సైన్యంలో 1.40 లక్షల మంది వరకు మరణించినట్టు సమాచారం.

2022 ఫిబ్రవరి 24న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌పై సైనిక దాడి ప్రారంభించారు. ప్రారంభ దశలోనే వేగంగా ముందుకు సాగి ఉక్రెయిన్‌ను అధీనంలోకి తెచ్చేయొచ్చని భావించినప్పటికీ, ఉక్రెయిన్ సైన్యం గట్టి ప్రతిఘటన చూపింది. ప్రస్తుతం కూడా ఇరుదేశాల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. దాదాపు 20 శాతం ఉక్రెయిన్ భూభాగం రష్యా నియంత్రణలో ఉన్నట్లు అంచనా. తమ స్వాతంత్ర్యాన్ని కాపాడుకున్నామని, రష్యా లక్ష్యాలు సాధ్యం కాలేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో పేర్కొన్నారు.

ఈ ఘర్షణలో అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలిచాయి. అమెరికా సుమారు 175 బిలియన్ డాలర్లు, ఈయూ దాదాపు 230 బిలియన్ డాలర్ల సహాయాన్ని అందించాయి. ఇదిలా ఉండగా, అమెరికా మధ్యవర్తిత్వంతో శాంతి చర్చలు కొనసాగుతున్నాయి. జెనీవాలో జరిగిన తాజా చర్చల్లో కొంత పురోగతి సాధించామని అమెరికా వర్గాలు చెబుతున్నాయి. అయితే కీలక అంశాలపై ఇరుపక్షాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. డాన్‌బాస్ ప్రాంతం సహా తమ ఆధీనంలోని ప్రాంతాలను కొనసాగించాలని, జపోరిజియా అణు విద్యుత్ కేంద్రంపై నియంత్రణ కావాలని రష్యా పట్టుదలగా ఉంది. మరోవైపు, తమ భూభాగాన్ని వదులుకునే ప్రశ్నే లేదని ఉక్రెయిన్ స్పష్టం చేస్తోంది. దీంతో శాంతి ఒప్పందంపై ఇంకా స్పష్టత రాలేదు.

Tags:    

Similar News