Pak-Afghan: పాక్‌-అఫ్గాన్‌ బోర్డర్‌ బంద్.. కిలో టమాటా రూ. 600!

బోర్డర్‌ మూసివేతతో ఇరుదేశాల్లో భారీగా పెరిగిన పండ్లు, కూరగాయలు..

Update: 2025-10-24 05:30 GMT

పాకిస్థాన్‌-అఫ్గానిస్థాన్‌ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో అక్టోబర్‌ 11వ తేదీ నుంచి ఇరు దేశాల మధ్య సరిహద్దులను మూసివేశారు. దీంతో పాక్‌- అఫ్గాన్‌ ప్రజలపై తీవ్ర ప్రభావం పడింది. బోర్డర్‌ మూసివేయడం వల్ల రెండు దేశాల్లో పండ్లు, కూరగాయలు, ఖనిజాలు, ఔషధాలు, గోధుమలు, బియ్యం, చక్కెర, మాంసం, పాల ఉత్పత్తులు లాంటి నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగిపోయాయి. ఘర్షణకు ముందుతో పోలిస్తే పాక్‌లో టమాటా ధరలు 5 రెట్లు పెరిగినట్లు స్థానిక మీడియా కథనాలు ప్రసారం చేసింది. ప్రస్తుతం కిలో టమాటా ధర 600 పాక్ రూపాయలుగా అమ్ముతున్నట్లు సమాచారం. అఫ్గాన్‌ నుంచి అధికంగా దిగుమతి చేసుకునే యాపిల్‌ ధరలు కూడా భారీగా పెరిగిపోయినట్లు టాక్.

కాగా, సాధారణంగా పాక్‌- అఫ్గాన్‌ సరిహద్దు నుంచి ఏటా 2.3 బిలియన్‌ డాలర్ల వాణిజ్యం కొనసాగుతుంది. ఇరుదేశాల మధ్య ఘర్షణలు పెరగడంతో బోర్డర్లలో వాణిజ్య, రవాణా సదుపాయాలు పూర్తిగా ఆపేశామని కాబుల్‌లోని పాక్-అఫ్గాన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధిపతి ఖాన్ జాన్ అలోకోజాయ్ తెలియజేశారు. దీంతో రోజుకు రెండు దేశాల్లో దాదాపు 1 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.8 కోట్లు) నష్టం జరుగుతున్నట్లు సమాచారం. అఫ్గాన్‌ నుంచి పాక్‌కు సరఫరా చేసే దాదాపు 5 కంటైనర్ల కురగాయలు పాడైతునట్లు చెప్పుకొచ్చారు. సరిహద్దుకు రెండు వైపులా దాదాపు 5వేల కంటైనర్లు ఆగిపోయాయని పాక్ లోని ప్రధాన టోర్ఖామ్ సరిహద్దు క్రాసింగ్ దగ్గర ఉన్న ఓ అధికారి వెల్లడించినట్లు దాయాది దేశ మీడియా వర్గాలు కథనాలు ప్రచురించింది.

అయితే, గత కొన్ని రోజులుగా పాకిస్థాన్- అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో తీవ్ర ఘర్షణలు జరిగి పలువురు సైనికులు, పౌరులు, ఉగ్రవాదులు చనిపోయారు. ఈ నేపథ్యంలో గత వారం ఖతార్‌లోని దోహాలో పాక్, అఫ్గాన్‌ రక్షణ మంత్రులు ఖ్వాజా ఆసిఫ్, ముల్లా యాకుబ్‌ల మధ్య చర్చలు కొనసాగాయి. ఇందులో భాగంగా ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి ఒప్పుకున్నాయి. కానీ, సరిహద్దు వాణిజ్యం మాత్రం ఇంకా ఒపెన్ కాలేదు. రెండు దేశాల మధ్య తదుపరి రౌండ్ చర్చలు అక్టోబర్ 25వ తేదీన ఇస్తాంబుల్‌లో జరిగే అవకాశం ఉంది.

Tags:    

Similar News