Solar Eclipse 2024: ఉత్తర అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం

ఏప్రిల్ 8వ తేదీన ఓ అద్భుతమైన ఖగోళ ఘటన

Update: 2024-04-09 01:15 GMT

ఉత్తర అమెరికాలో సోమవారం సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించింది. మెక్సికో, అమెరికా, కెనడాల్లోని నిర్దిష్ట ప్రదేశాల్లో ఖగోళ అద్భుతం దర్శనమిచ్చింది. గ్రహణంలో సంపూర్ణ దశ గరిష్ఠంగా 4 నిమిషాల 28 సెకన్లు కొనసాగింది. ఆ సమయంలో చందమామ సూర్యుడిని పూర్తిగా కప్పేసింది. పట్టపగలే చీకట్లు ఆవరించాయి.

గ్రహణం తొలుత మెక్సికోలో దర్శనమిచ్చింది. ఉత్తర అమెరికాలో మొత్తంలో మెక్సికన్ బీచ్ సైడ్ రిసార్ట్ పట్టణం మజట్లాన్ ప్రధాన గ్రహణ వీక్షణ ప్రదేశమని ప్రకటించారు. అంతకుముందు సూర్యగ్రహణాన్ని వీక్షిస్తున్నప్పుడు భద్రత తప్పనిసరిగా పాటించాలని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా గట్టిహెచ్చరిక చేసింది. ఇదే చివరి చూపు కాకూడదంటే గ్రహణాన్ని చూసేటపుడు ఫిల్టర్లు తప్పనిసరని తెలిపింది. ఈ క్రమంలో గ్రహణ ప్రభావిత దేశాల్లోని వీక్షణా ప్రాంతాలకు ప్రజలు భారీగా తరలివెళ్లారు. నల్ల కళ్లద్దాలు, ఇతర రక్షణ పరికరాల సాయంతో సూర్యగ్రహణాన్ని వీక్షించారు. దాదాపు ఒక శతాబ్దకాలంలో న్యూయార్క్ రాష్ట్రంలోని పశ్చిమ, ఉత్తర ప్రాంతాల్లో సంపూర్ణ గ్రహణం కనిపించిందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. సోమవారం ఏర్పడిన సంపూర్ణ సూర్య గ్రహణం చారిత్రాత్మక ఖగోళ సంఘటన అని పేర్కొన్నారు. మళ్లీ ఇలాంటి గ్రహణం ఏర్పడాలంటే 2044 ఆగస్టు వరకు అమెరికన్లు వేచిచూడాల్సిందే అని వెల్లడించారు.

సెంట్రల్ న్యూ మెక్సికో, సదరన్ టెక్సాస్, సౌత్ వెస్ట్ కొలరాడో, నార్త్ ఈస్ట్ అరిజోనా, సెంట్రల్ ఉటా, నెవడా గ్రేట్ బేసిన్ నేషనల్ పార్క్, నార్త్ ఈస్ట్ నెవడా, నార్త్ కాలిఫోర్నియా ప్రజలు సంపూర్ణ సూర్యగ్రహణాన్ని వీక్షించారు. మళ్లీ 2044లో అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుందని నాసా తెలిపింది. ఈగిల్ పాస్ మొదలుకుని కెనడా వరకు సోలార్ ఎక్సిప్స్ పాత్ 4,000 కిలోమీటర్లుగా నమోదైనట్లు పేర్కొంది. కెనడా కాలమానం ప్రకారం.. సాయంత్రం 5:16 నిమిషాలకు ఆ దేశంలోని న్యూఫౌండ్‌ల్యాండ్ వద్ద సూర్యగ్రహణం కాలం ముగిసింది. సూర్యుడు మూడున్నర నుంచి నాలుగు నిమిషాల పాటు గ్రహణ ఛాయలో ఉన్నాడు. 

సూర్యుడు- చంద్రుడు- భూమి ఒకే సరళరేఖ పైకి వచ్చినప్పుడు సూర్యగ్రహణం సంభవిస్తుంటుంది. సూర్యుడు-భూమికి మధ్య చంద్రుడు అడ్డుగా వచ్చినప్పుడు భూమిపై ఉన్న వారికి సూర్యుడు కనిపించడు.



Tags:    

Similar News