Bill Gates: భారత యువతకు బిల్‌గేట్స్ సూచన
యువత ఎక్కువగా ప్రయాణాలు చేయాలన్న బిల్‌గేట్స్;
ప్రపంచ కుబేరుల్లో ఒకరు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భారత యువతకు కీలక సూచనలు చేశారు. యువత ఎక్కువగా ప్రయాణాలు చేయాలని.. పేదలు నివసించే ప్రదేశాలను ఒకసారి పరిశీలించాలని కోరారు. ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రపంచంలోనే భారత్ టాలెంట్ హబ్‌గా ఎందుకు మారుతోందని ఎదురైన ప్రశ్నపై బిల్‌గేట్స్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘భారతీయులు గొప్ప ప్రతిభావంతులు. సులభంగా సమస్యలను పరిష్కరిస్తారు. వారి ఆవిష్కరణలను చూస్తే ఈ విషయం అవగతమవుతుంది. డిజిటల్ రంగంలోనూ భారత్ దూసుకెళుతోంది. ‘ఆధార్’ లాంటి సంబంధిత కార్యక్రమాలు ఇందుకు నిదర్శనం’’ అంటూ ఆయన ప్రశంసించారు.
‘‘భారత్‌లోని యువకులు ఎక్కువగా ప్రయాణాలు చేయాలి. పేదలు నివసించే ప్రాంతాలను ఒకసారి పరిశీలించండి. అక్కడి వారు ఎంతో తెలివైనవారు. కానీ, వారికి అవకాశాలు తక్కువ. మంచి విద్య అందడం లేదు. వారికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. వీటిని యువత గమనించాలి’’ అని సూచించారు. ఈ పాడ్‌కాస్ట్‌లో తన ఆస్తికి సంబంధించిన విషయాలను కూడా పంచుకున్నారు. తండ్రి కూడబెట్టిన ఆస్తిపై ఆధారపడకుండా వాళ్లు సొంతంగా సంపాదించుకోగలరనే నమ్మకం తనకు ఉందన్నారు. తాను సంపాదించిన మొత్తంలో 1 శాతం కంటే తక్కువ పిల్లలకు ఇస్తానని తెలిపారు.