Trinidad PM : ట్రినిడాడ్ ప్రధాని నోట..మోడీ బుక్‌లోని కవిత..

Update: 2025-07-05 05:33 GMT

ప్రధాని మోడీ ట్రినిడాడ్ అండ్ టొబాగో పర్యటన ఆసక్తికరంగా సాగుతోంది. మోడీ రాసిన గుజరాతి కవితలోని కొన్ని వాక్యాలను ఆ దేశ ప్రధాని కమ్లా పెర్సాద్-బిస్సేస్సార్ ప్రస్తావించి అందరిని ఆశ్చర్యపరిచారు. ‘‘గడిచిపోయిన రోజుల్లోకి మనసుతో ప్రయాణించినప్పుడు ఎన్నో జ్ఞాపకాలు కళ్లముందు కదలాడతాయి. కష్టకాలంలో మనతో నడిచిన వారిని ఎప్పటికీ మర్చిపోలేం. ఆ జ్ఞాపకాలే మన ప్రయాణంలో భాగమవుతాయి’’ అనే భావం వచ్చే వ్యాఖ్యలను ఆమె సభలో వినిపించారు. ఈ వాక్యాలు ప్రధాని మోడీ గుజరాతిలో రచించిన Aankh Aa Dhanya Che అనే పుస్తకంలోనివి.

కరేబియన్ దేశమైన ట్రినిడాడ్ అండ్ టొబాగో జనాభాలో దాదాపు 40 శాతం మంది భారత సంతతికి చెందినవారే. భారత విదేశాంగ శాఖ లెక్కల ప్రకారం.. ఈ దేశంలో సుమారు 5.56 లక్షల మంది భారతీయ మూలాలున్న ప్రజలు నివసిస్తున్నారు. 1845 నుంచి 1917 మధ్య కాలంలో ఒప్పంద కార్మికులుగా భారత్ నుంచి వలస వెళ్లిన వారి వారసులే వీరిలో అధిక శాతం మంది. ఈ నేపథ్యంలో మోడీ పర్యటన, ఆయన కవితను అక్కడి ప్రధాని ప్రస్తావించడం ఇరు దేశాల మధ్య సాంస్కృతిక బంధానికి నిదర్శనంగా నిలిచింది.

కాగా ప్రధాని తన పర్యటన లో ఆ దేశంతో మనకు ఉన్న బలమైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక బంధాలను చాటిచెప్పారు. ఇందులో భాగంగా ఆ దేశ ప్రధాని కమలా ప్రసాద్ బిస్సేస్సర్ కు అయోధ్య రామ మందిర నమూనా తో పాటు పవిత్ర సరయు నది జలాన్ని మహా కుంభమేళా తీర్థాన్ని వారికి బహుకరించారు... ఈ కానుకలు ఇరుదేశాల సాంస్కృతిక సంబంధాలను ప్రతిబింబిస్తాయని ప్రధాని మోదీ ఎక్స్ లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఏర్పాటుచేసిన ప్రత్యేక విందులో పవిత్రంగా భావించే సోహరి ఆకుపై ఆహారాన్ని వడ్డించారు. పండుగలు, ప్రత్యేక కార్యక్రమాల్లో ఇలా ఆకుపై భోజనం చేయడం అక్కడి సంప్రదాయం.

Tags:    

Similar News