Trump: హార్వర్డ్ యూనివర్సిటీకి ట్రంప్ సర్కార్ భారీ షాక్!

విద్యార్థుల ‘హార్వర్డ్‌’ కలలు కల్లలే..!;

Update: 2025-04-17 05:00 GMT

హార్వర్డ్ యూనివర్సిటీపై చర్యలకు ట్రంప్ సర్కార్ రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే యూనివర్సిటీకి అందించే 2.2 బిలియన్‌ డాలర్ల ఫెడరల్‌ నిధులను నిలిపివేసింది. తాజాగా విశ్వవిద్యాలయానికి ఇస్తున్న పన్ను మినహాయింపును కూడా రద్దు చేయాలని రెవెన్యూ ఏజెన్సీకి ట్రంప్ ఆదేశించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ట్రంప్ ప్రభుత్వం ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్(ఐఆర్ఎస్‌)ను కోరినట్లుగా నివేదిక అందుతోంది. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.

హార్వర్డ్ యూనివర్సిటీ యూదు మతానికి వ్యతిరేకంగా పని చేస్తోందని.. హమాస్ మద్దతుగా కార్యకలాపాలు కొనసాగిస్తుందని ఇటీవల వైట్‌హౌస్ ఆరోపించింది. జో బైడెన్ పదవీకాలంలో అమెరికాలోని అనేక యూనివర్సిటీల్లో హమాస్‌కు మద్దతుగా ఆందోళనలు జరిగాయి. ఇక హార్వర్డ్ యూనివర్సిటీ అయితే ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌నకు వ్యతిరేకంగా పని చేసిందని కూడా ఆరోపణలు ఉన్నాయి. దీంతో హార్వర్డ్ యూనివర్సిటీపై ట్రంప్ సర్కార్ కత్తి కట్టినట్లుగా కనిపిస్తోంది.

విశ్వవిద్యాలయాలకు పన్ను మినహాయింపు తొలగింపు అనేది చాలా అరుదుగా జరుగుతోంది. అలాంటిది హార్వర్డ్ యూనివర్సిటీ విషయంలో మాత్రం ట్రంప్ చర్యలకు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు అధికారులకు ట్రంప్ సూచన ఇచ్చారు. రాజకీయ, సైద్ధాంతిక, ఉగ్రవాద ప్రేరేపిత మద్దతు గల విశ్వవిద్యాలయానికి పన్ను మినహాయింపు ఇవ్వడం ఏ మాత్రం భావ్యం కాదని.. తక్షణమే రద్దు చేయాలని ట్రంప్ సూచించినట్లుగా సమాచారం.

అయితే ట్రంప్ ఆదేశాలపై ఇప్పటి వరకు హార్వర్డ్ యూనివర్సిటీ ఇంకా స్పందించలేదు. నిజంగా పన్ను మినహాయింపును రద్దు చేస్తే ఇది చాలా అసాధారణమైన చర్యగా చెప్పొచ్చు. ఇలాంటి చర్య 1980లో జరిగింది. జాతి వివక్షత కారణంగా ఒక క్రైస్తవ కళాశాలకు పన్ను మినహాయింపును రద్దు చేశారు. ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీ విషయంలో కూడా అదే జరగబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

సాధారణంగా పాఠశాలలు, స్వచ్ఛంద సంస్థలు వంటి లాభాపేక్షలేని సంస్థలకు పన్ను మినహాయింపులు ఉంటాయి. కానీ వారు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు తేలితే మాత్రం ఆ హక్కును కోల్పోయే ప్రమాదం ఉంది. అయితే హార్వర్డ్ యూనివర్సిటీ 2024లో ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌నకు వ్యతిరేకంగా పని చేసినట్లుగా తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే హార్వర్డ్ యూనివర్సిటీకి పన్ను మినహాయింపు రద్దు చేసే యోచనలో ట్రంప్ సర్కార్ పని చేస్తోంది.

Tags:    

Similar News