Donald Trump : భారత్ కష్టాలు పెంచుతున్న ట్రంప్.. అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలతో టెన్షన్!
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి చేసిన సంచలన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. గతంలో పహల్గామ్ దాడులు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన ట్రంప్, తాజాగా భారత్-రష్యా చమురు కొనుగోళ్లపై ఒక పెద్ద దావా చేశారు. రష్యా నుంచి చమురు దిగుమతులను ఆపేయడానికి భారత్ అంగీకరించిందని ఆయన ప్రకటించారు. అయితే, ఈ ప్రకటన, ఇప్పటికే సుంకాలు, ఇతర అంశాల కారణంగా కొంత ఉద్రిక్తత నెలకొన్న భారత్-అమెరికా సంబంధాలను మరింత క్లిష్టం చేసే అవకాశం ఉంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లో నాటో కార్యదర్శితో సమావేశం అయిన తర్వాత విలేకరులతో మాట్లాడుతూ భారత్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఆపేయడానికి భారత్ అంగీకరించిందని ఆయన ప్రకటించారు. రష్యా నుంచి చమురు కొనడం మానేస్తామని భారత్ తనతో చెప్పిందని ట్రంప్ అన్నారు. ఇది ఒక ప్రాసెస్ అని, వెంటనే ఆపడం సాధ్యం కాదని అయితే సంవత్సరం చివరి నాటికి దిగుమతులు దాదాపుగా నిలిచిపోతాయి అని, అంటే సుమారు 40 శాతం వరకు తగ్గుతాయని భారత్ చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. దీని తర్వాత చైనాను కూడా ఇదే విధంగా రష్యా నుంచి చమురు కొనడం ఆపాలని ఒప్పిస్తానని ట్రంప్ తెలిపారు.
రష్యా నుంచి చమురు కొనుగోళ్లు పెంచడం ద్వారా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఆర్థికంగా మద్దతు ఇస్తున్నట్లే అని అమెరికా భావిస్తోంది. ఈ కారణంగా, గత కొద్ది రోజులుగా ఢిల్లీ, వాషింగ్టన్ మధ్య సంబంధాలలో ఉద్రిక్తత పెరిగింది. ట్రంప్ పరిపాలన భారతీయ వస్తువులపై ఏకంగా 50 శాతం అధిక సుంకం విధించింది. ఇందులో 25 శాతం ప్రాథమిక సుంకం కాగా, రష్యా నుంచి చమురు కొనుగోలు చేసినందుకు జరిమానాగా 25 శాతం అదనపు సుంకం విధించారు.
ట్రంప్ చేసిన ఈ ప్రకటనపై రష్యా లేదా భారత్ ఇంకా అధికారికంగా స్పందించలేదు. ట్రంప్ వ్యాఖ్యల్లో ఎంతవరకు నిజం ఉందనేది స్పష్టం కానప్పటికీ, ఇది రెండు దేశాల మధ్య రాజకీయ చర్చను పెంచింది. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపే మార్గాలపై చర్చించేందుకు త్వరలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో కూడా తాను భేటీ అవుతానని ట్రంప్ చెప్పారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఎలా అంతం చేయాలనే దాని గురించి, అది చమురు, శక్తి లేదా ఇతర మార్గాల ద్వారా కావచ్చు, ముఖ్యంగా చైనా అధ్యక్షుడితో మాట్లాడతానని ఆయన అన్నారు. ఈ నెల చివర్లో దక్షిణ కొరియాలో జరగబోయే ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ శిఖరాగ్ర సమావేశంలో ట్రంప్ షీ జిన్‌పింగ్‌తో సమావేశం కానున్నారు.
ట్రంప్ తన వాణిజ్య విధానాన్ని సమర్థించుకుంటూ, అధిక సుంకాలు విధించడం వల్ల అమెరికా మరింత శక్తివంతమైన దేశంగా మారిందని అన్నారు. గతంలో ఈ సుంకాలు తమకు వ్యతిరేకంగా ఉపయోగించామని, అది అమెరికాను బలహీనపరిచిందని, అప్పును 37 ట్రిలియన్ డాలర్లకు పెంచిందని ట్రంప్ ఆరోపించారు. ఇప్పుడు సుంకాల కారణంగానే అమెరికా సంపన్నమైందని, ఇది సంఘర్షణలను నివారించడంలో కూడా సహాయపడిందని ఆయన వాదించారు. తాను ఎనిమిది యుద్ధాలను ఆపానని, వాటిలో ఐదు లేదా ఆరు కేవలం సుంకాల కారణంగానే ఆగిపోయాయని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే, భారత్ పాకిస్తాన్ మధ్య ఇటీవల జరిగిన సైనిక ఉద్రిక్తతను ఆపడంలో కూడా తాను కీలక పాత్ర పోషించానని ట్రంప్ పునరుద్ఘాటించారు.