Trump Tariff : డ్రాగన్ కంట్రీపై ట్రంప్ వార్.. చైనా ఉత్పత్తులపై నవంబర్ 1 నుంచి 100% టారిఫ్

Update: 2025-10-11 04:45 GMT

Trump Tariff : అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం మళ్లీ తీవ్ర స్థాయికి చేరుకుంది. అమెరికా పరిశ్రమలకు అత్యంత అవసరమైన రేర్ ఎర్త్ మెటల్స్ ఎగుమతులపై చైనా అకస్మాత్తుగా ఆంక్షలు విధించడంతో ఈ వివాదం మొదలైంది. చైనా తీసుకున్న ఈ చర్యను ఆక్రమణ ధోరణిగా అభివర్ణించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, వెంటనే చైనా ఉత్పత్తులపై అదనపు టారిఫ్‌లు విధిస్తామని ప్రకటించారు.

ట్రంప్ మాట్లాడుతూ చైనా చర్యలకు ప్రతీకారంగా నవంబర్ 1 నుండి చైనా నుండి దిగుమతి చేసుకునే అన్ని ఉత్పత్తులపై అమెరికా 100% అదనపు టారిఫ్ విధిస్తుందని ప్రకటించారు. ఇప్పటికే ఉన్న టారిఫ్‌లతో పాటు ఈ కొత్త పన్ను వర్తిస్తుంది. దీంతోపాటు, అదే రోజు నుంచి అన్ని సాఫ్ట్‌వేర్‌లపై కూడా ఎగుమతి కంట్రోల్ అమలు చేస్తామని ట్రంప్ స్పష్టం చేశారు.

టారిఫ్‌ల ప్రకటన తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో మీ భేటీ రద్దవుతుందా అని అడగగా, "లేదు, నేను రద్దు చేయలేదు. కానీ భేటీ అవుతామో లేదో తెలియదు" అని ట్రంప్ సమాధానమిచ్చారు. చైనా తమ ఎగుమతి నియంత్రణలను వెనక్కి తీసుకుంటే ఈ అదనపు టారిఫ్‌లు తొలగిస్తారా అని అడగగా, "ఏం జరుగుతుందో చూద్దాం. అందుకే నేను దీనికి నవంబర్ 1 తేదీని ఉంచాను" అని ట్రంప్ బదులిచ్చారు.

చైనా తన వాణిజ్య విధానంలో చాలా దూకుడుగా వ్యవహరిస్తోందని ట్రంప్ ఆరోపించారు. ప్రపంచ దేశాలకు చైనా ఒక శత్రుత్వ లేఖ పంపిందని, అందులో నవంబర్ 1, 2025 నుంచి తాము తయారు చేసే ప్రతీ ఉత్పత్తిపై, ఇంకా కొన్ని తాము తయారు చేయని ఉత్పత్తులపై కూడా భారీ ఎగుమతి నియంత్రణలు అమలు చేయబోతున్నామని చైనా ప్రకటించినట్లు ట్రంప్ వివరించారు. ఈ ప్రణాళికను చైనా చాలా సంవత్సరాల క్రితమే సిద్ధం చేసుకుందని, ఇది ప్రపంచంలోని అన్ని దేశాలనూ ప్రభావితం చేస్తుందని తెలిపారు.అంతర్జాతీయ వాణిజ్యంలో ఇలాంటి చర్యలు ఎప్పుడూ చూడలేదని అన్నారు.

రేర్ ఎర్త్ ఆంక్షల వివరాలు

చైనా తాజాగా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్‌ (స్మార్ట్‌ఫోన్‌లు, ఫైటర్ జెట్‌లు వంటి వాటి తయారీలో కీలకం)పై విస్తృతమైన కొత్త ఎగుమతి నియంత్రణలు విధించింది. ప్రపంచంలో ఈ ఖనిజాల ప్రాసెసింగ్‌లో చైనానే ఆధిపత్యం చెలాయిస్తోంది. చైనా గతంలో నిషేధించిన ఖనిజాల జాబితాకు ఇప్పుడు హోల్మియం, ఎర్బియం, థూలియం, యూరోపియం, యటర్బియం వంటి ఐదు కొత్త ఖనిజాలను చేర్చింది. దీంతో మొత్తం 17 రకాలలో 12 ఖనిజాలపై ఆంక్షలు అమలవుతాయి.

ఇకపై కేవలం ఖనిజాలకు మాత్రమే కాదు, వాటి మైనింగ్, స్మెల్టింగ్, మాగ్నెట్ ఉత్పత్తికి సంబంధించిన సాంకేతికతలకు కూడా ఎగుమతి లైసెన్స్ తప్పనిసరి అవుతుంది. ఈ చర్యల వెనుక ఉద్దేశం జాతీయ భద్రత, దేశ ప్రయోజనాలను కాపాడటమేనని, ఈ కీలక వస్తువులను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సైనిక, ఇతర సున్నితమైన రంగాలలో ఉపయోగించకుండా నిరోధించడమే తమ లక్ష్యమని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఎలక్ట్రిక్ వాహనాలలో ఉపయోగించే లిథియం బ్యాటరీలు, గ్రాఫైట్ అనోడ్ మెటీరియల్‌ పై కూడా చైనా కొత్త ఆంక్షలు విధించింది. ఈ కొత్త చర్యలు నవంబర్-డిసెంబర్ మధ్య పూర్తిగా అమలులోకి వస్తాయి. ఈ నెల చివర్లో దక్షిణ కొరియాలో జరిగే APEC సమ్మిట్‌లో అధ్యక్షుడు జిన్‌పింగ్, ట్రంప్ మధ్య భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ ఆంక్షలు, ఆ సమావేశానికి ముందే వాణిజ్య చర్చలలో బీజింగ్ ప్రభావం పెరుగుతున్నట్లు సూచిస్తున్నాయి.

Tags:    

Similar News