TRUMP: ట్రంప్ రూ.692 కోట్లు చెల్లించాలి
కోర్టులో వరుసగా ట్రంప్‌నకు ఎదురుదెబ్బలు... కరోల్‌కు 692 కోట్లు చెల్లించాలని ఆదేశం..;
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే వరుసగా కోర్టులో ఎదురుదెబ్బలు తగులుతున్న వేళ ట్రంప్‌కు మరోసారి షాక్ తగిలింది. అమెరికా అధ్యక్ష పీఠాన్ని రెండోసారి కైవసం చేసుకోవాలని చూస్తున్న డొనాల్డ్ ట్రంప్‌కు కోర్టు కేసుల్లో వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అమెరికన్ మాజీ కాలమిస్ట్ జీన్ కరోల్ దాఖలు చేసిన పరువునష్టం కేసులో న్యూయార్క్‌లోని మాన్‌హటన్ ఫెడరల్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో ట్రంప్... కరోల్‌కు 83.3 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు అక్షరాల 692 కోట్ల రూపాయలు అదనంగా చెల్లించాలని ఆదేశించింది. కొన్నేళ్ల క్రితం తనపై లైంగిక వేధింపులకు పాల్పడిన ట్రంప్.. ఇప్పుడు తన పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారంటూ కరోల్ ఇటీవల దావా వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు తాజాగా ట్రంప్‌నకు భారీ జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.
ఆమెకు నష్టపరిహారం కింద 18.3 మిలియన్ డాలర్లతోపాటు భవిష్యత్తులో అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండేలా మరో 65 మిలియన్ డాలర్లు చెల్లించాలని ఆదేశించింది. ఈ కేసుపై ఫెడరల్ కోర్టులో విచారణ జరుగుతుండగా.. ట్రంప్ అనూహ్యంగా కోర్టు హాలు నుంచి బయటకు వెళ్లిపోయారు. వాస్తవానికి ఈ కేసులో ట్రంప్‌నకు ఇప్పటికే మరో కోర్టు జరిమానా విధించింది. జీన్ కరోల్‌ను ట్రంప్ లైంగికంగా వేధించారని గతేడాది మే నెలలో కోర్టు నిర్ధారించింది. అందుకుగాను ఆమెకు 41.5 కోట్ల రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. దీనిపై కరోల్ తన రచనలను అమ్ముకోవడం కోసం అసత్య ఆరోపణలు చేస్తున్నారని ట్రంప్ విమర్శించడంతో పరువునష్టం కేసు దాఖలైంది. ఈ కేసునే తాజాగా మాన్‌హటన్ ఫెడరల్ కోర్టు విచారించి.. బాధితురాలికి అదనంగా మరో 83.3 మిలియన్ డాలర్లు చెల్లించాలని తీర్పు చెప్పింది. ఈ తీర్పును హాస్యాస్పదంగా పేర్కొన్న ట్రంప్.. బైడెన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మన న్యాయవ్యవస్థ నియంత్రణ కోల్పోయిందని... ఈ వ్యవస్థను రాజకీయ ఆయుధంగా వాడుతున్నారని ట్రంప్ విమర్శలు చేశారు. తాజా తీర్పుపైన పైకోర్టులో అప్పీలు చేయనున్నట్లు తెలిపారు.
1996లో మాన్‌హటన్‌లోని ఓ డిపార్ట్‌మెంటల్ స్టోరులో కరోల్‌కు ట్రంప్ పరిచయమయ్యారు. వేరే మహిళకు లోదుస్తులను బహుమతిగా ఇవ్వాలంటూ ట్రంప్ తనతో మాట కలిపారని, డ్రెస్సింగ్ రూంలో ఒంటరిగా ఉన్న తనపై లైంగికదాడికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. ఈ అనూహ్య ఘటనతో షాక్‌కు గురై.. అత్యాచార బాధితురాలిగా తనను తాను చూసుకోలేకపోవడం వల్లే అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేయలేదన్నారు. ఈ ఘటన జరిగిన చాలా ఏళ్ల తర్వాత ఓ పుస్తకంలో కరోల్ వెల్లడించిన వివరాలను న్యూయార్క్ మ్యాగజీన్ 2019లో ప్రచురించింది.