Donald Trump : గ్రీన్‌లాండ్ కొంటానంటున్న ట్రంప్..వద్దంటే టాక్స్ తో కొడతానంటున్న వైనం.
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రపంచ దేశాలను వణికించే నిర్ణయంతో వార్తల్లో నిలిచారు. డెన్మార్క్ పాలనలో ఉన్న గ్రీన్‌లాండ్ ద్వీపాన్ని ఎలాగైనా కొనేయాలన్న తన పాత మొండి పట్టును ఆయన మళ్లీ తెరపైకి తెచ్చారు. ఈసారి కేవలం అడగడమే కాదు, గ్రీన్‌లాండ్‌ను అమ్మకపోతే తన సొంత నాటో మిత్రదేశాలపైనే ఆర్థిక యుద్ధం ప్రకటిస్తానని హెచ్చరించారు. ఈ వార్తతో యూరప్ దేశాలతో పాటు భారత స్టాక్ మార్కెట్, బంగారం ధరల్లోనూ తీవ్ర అలజడి మొదలైంది.
తాజాగా సోషల్ మీడియా వేదికగా ట్రంప్ ఒక సంచలన పోస్ట్ చేశారు. గ్రీన్‌లాండ్ విక్రయంపై చర్చలకు డెన్మార్క్, దాని మిత్రదేశాలు ఒప్పుకోకపోతే, భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. ఫిబ్రవరి 1, 2026 నుంచి డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ వంటి దేశాల నుంచి వచ్చే దిగుమతులపై 10% టారిఫ్ వేస్తానని ప్రకటించారు. ఒకవేళ జూన్ నాటికి కూడా వారు లొంగకపోతే, ఈ పన్నును ఏకంగా 25 శాతానికి పెంచుతానని స్పష్టం చేశారు. ఆర్కిటిక్ ప్రాంతంలో చైనా, రష్యాల దూకుడును అడ్డుకోవాలంటే గ్రీన్‌లాండ్ అమెరికా చేతిలో ఉండాల్సిందేనని ఆయన వాదిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా రాజకీయ ఉద్రిక్తతలు పెరిగితే ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ల కంటే బంగారం వైపే మొగ్గు చూపుతారు. ట్రంప్ తాజా నిర్ణయంతో బంగారం, వెండి ధరలు కొత్త రికార్డులను తాకవచ్చు. ప్రస్తుతం ఎంసీఎక్స్ (MCX) మార్కెట్‌లో తులం బంగారం ధర రూ.1,43,150 వద్ద ఉండగా, రానున్న రోజుల్లో ఇది రూ.1.45 లక్షల వరకు వెళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అమెరికా-ఇరాన్ మధ్య ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలకు తోడు, ఇప్పుడు గ్రీన్‌లాండ్ ఇష్యూ కూడా తోడవడంతో డాలర్ కంటే బంగారం సురక్షితమని పెట్టుబడిదారులు భావిస్తున్నారు.
ఈ పరిణామాలు భారత మార్కెట్‌పై మిశ్రమ ప్రభావం చూపనున్నాయి. ట్రంప్ పన్నుల యుద్ధం వల్ల విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్ నుండి నిధులను వెనక్కి తీసుకునే అవకాశం ఉంది, దీనివల్ల సెన్సెక్స్, నిఫ్టీలు ఒడిదుడుకులకు లోనవుతాయి. అయితే, దీనివల్ల భారత్‌కు ఒక మంచి అవకాశం కూడా ఉంది. అమెరికాతో సంబంధాలు చెడిపోతే యూరప్ దేశాలు ప్రత్యామ్నాయం కోసం భారత్ వైపు చూస్తాయి. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న భారత్-యూరప్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంది. ఇది జరిగితే మన టెక్స్‌టైల్స్, ఫార్మా, ఆటోమొబైల్ రంగాలకు భారీగా లాభాలు చేకూరుతాయి.