Ukraine Drone Attacks : రష్యాపై డ్రోన్లతో విరుచుకుపడిన ఉక్రెయిన్

Update: 2025-04-10 11:15 GMT

రష్యాపైకి ఉక్రెయిన్ మరోసారి డ్రోన్లతో విరుచుకుపడింది. రాత్రికిరాత్రే భారీసంఖ్యలో డ్రోన్లను ప్రయోగించింది. దీనివల్ల బుధవారం తెల్లవారుజామున రష్యా దక్షిణ ప్రాంతంలో విమాన రాకపోకలకు అంతరాయం కలిగినట్లు మాస్కో అధికారులు వెల్లడించారు. ముందుజాగ్రత్త చర్యగా రోస్తావ్ ప్రాంతంలో డజనకొద్ది అపార్టుమెంట్లను ఖాళీ చేయించామని కూడా వివరించారు. తాజా దాడి గురించి రష్యా రక్షణశాఖ స్పందించింది. తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు 158 డ్రోన్లను కూల్చేశాయి. ఇందులో రాస్తోవ్ ప్రాంతంలోకి చొచ్చుకొచ్చిన 29 డ్రోన్లు కూడా ఉన్నాయి. అయితే ఈ దాడిలో పెద్దగా నష్టం జరగలేదు. ముందస్తు జాగ్రత్తగా పౌరులను ఖాళీ చేయించాం అని తెలిపారు.

అయితే, కీవ్ నుంచి మొత్తం ఎన్ని డ్రోన్లు రష్యా గగనతలంలోకి చొచ్చుకొచ్చాయి అన్నదానిపై మాత్రం మాస్కో అధికారులు స్పష్టత ఇవ్వలేదు. కూల్చివేసిన డ్రోన్లలో రష్యాలోని క్రాస్నోడర్ ప్రాంతంలో 69, ఉత్తర ఒస్ఫేటియా ప్రాంతంలో 15 డ్రోన్లు ఉన్నట్లు తెలిసింది. మరోవైపు ఈ దాడులపై కీవ్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇదిలావుండగా, రష్యా తరఫున యుద్ధంలో చైనీయులు పాల్గొంటున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆరోపించారు. తమ బలగాలు ఇద్దరు చైనీయులను అదుపులోకి తీసుకున్నాయని చెప్పారు. డోనెట్స్ ప్రాంతంలో రష్యా బలగాలతో కలిసి పనిచేస్తున్న ఇద్దరు చైనీయులను తమ దళాలు బంధించాయని వెల్లడించారు. వారి వ్యక్తిగత డేటా, బ్యాంకు కార్డులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

Tags:    

Similar News