Pakistan: పాక్‌లో రాజ్యాంగ సవరణలు వివాదం.. ఐక్యరాజ్య సమితి వార్నింగ్..

ప్రమాదం పొంచి ఉందా?

Update: 2025-12-01 02:00 GMT

దాయాది దేశం పాకిస్తాన్ ఇటీవల రాజ్యాంగ సవరణ చేసింది. నవంబర్ 13న 27వ రాజ్యాంగ సవరణ బిల్లుపై పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ సంతకం చేశారు. పాక్ సైన్యాధిపతి, ఫీల్డ్‌ మార్షల్ అసీం మునీర్‌కు అనేక అధికారాలు ఇస్తూ, జీవితాంతం అరెస్ట్‌, ప్రాసిక్యూషన్‌ నుంచి రక్షణ ఇచ్చే తీర్మానాన్ని ఆ దేశ పార్లమెంట్‌ ఆమోదించిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ ఎలాంటి చర్చ లేకుండా త్వరితగతిన ఈ సవరణలకు ఆమోదం తెలిపింది. దీని ద్వారా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ దేశ సర్వసైన్యాధ్యక్షుడిగా మారడంతో పాటు సుప్రీంకోర్టు అధికారాలను తగ్గించారు. ఈ సవరణలపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేస్తూ, రానున్న కాలంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది.

యూఎన్ మానవ హక్కుల హైకమిషనర్ వోల్కర్ టర్క్ శుక్రవారం మాట్లాడుతూ.. పాక్ రాజ్యాంగ సవరణలు చట్టపరమైన సమాజం, పాకిస్తాన్ ప్రజలతో చర్చించకుండా ఆమోదించారని అన్నారు. పాకిస్తాన్ తొందరపడి ఆమోదించిన రాజ్యాంగ సవరణలు న్యాయ స్వతంత్రతను దెబ్బతీస్తాయని, సైనిక జవాబుదారీతనం, చట్ట పాలనపై గౌరవం తగ్గుతాయని అన్నారు. న్యాయవ్యవస్థలో జోక్యం, కార్యనిర్వాహక నియంత్రణకు లోనయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సవరణలు పాకిస్తాన్ ప్రజస్వామ్యానికి, చట్ట పాలన సూత్రాలకు తీవ్ర పరిణామాలు కలిగిస్తాయని అన్నారు.

పాకిస్తాన్ ఇటీవల, సుప్రీంకోర్టు అధికారాలకు కోత పెడుతూ కొత్తగా ఫెడరల్ కాన్సిట్యూషనల్ కోర్టును తీసుకువచ్చింది. రాజ్యాంగ కేసుల్ని ఈ కొత్త కోర్టు విచారిస్తుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు కేవలం సివిల్, క్రిమినల్ కేసులను మాత్రమే పరిష్కరిస్తుంది. పాకిస్తాన్ సైన్యం ఇప్పుడు ప్రజాస్వామ్యం కన్నా శక్తివంతంగా మారింది. ఆర్మీ చీఫ్‌ అసిమ్ మునీర్‌ను సర్వ సైన్యాధ్యక్షుడిగా చేసింది. ఇంతకుముందు ఈ అధికారం ప్రెసిడెంట్, క్యాబినెట్ పరిధిలో ఉండేది. ఇప్పుడు అసిమ్ మునీర్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌కు చీఫ్‌గా మారాడు. ఇదే కాకుండా, ఫీల్డ్ మార్షల్, మార్షల్ ఆఫ్ ది ఎయిర్ ఫోర్స్, అడ్మిరల్ ఆఫ్ ది ఫ్లీట్ లకు జీవితాంతం క్రిమినల్ చర్యలు, అరెస్టుల నుండి రోగనిరోధక శక్తిని కల్పిస్తుంది. దీనిపై పాకిస్తాన్ మానవహక్కుల మండలి సభ్యురాలు ఫర్వా అస్కర్, పాకిస్తానీ జర్నలిస్ట్ అలీఫియా సోహైల్‌లు నిరసన తెలపడంతో వీరిని అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించారు.

Tags:    

Similar News