Illegal Migration: అమెరికా బాటలో యూకే
బ్రిటన్‌లో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం, 600 మంది అరెస్ట్;
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాటలోనే యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ నడుస్తున్నారు. దేశవ్యాప్తంగా అక్రమ వలసదారుల కోసం జల్లెడ పడుతున్నది. భారతీయ రెస్టారెంట్లపై ప్రత్యేక దృష్టి పెట్టి గాలిస్తున్నది. అక్రమ వలసలపై తీసుకుంటున్న చర్యల గురించి సోమవారం యూకే హోం సెక్రటరీ య్వెట్ కూపర్ కీలక ప్రకటన చేశారు. జనవరిలో 828 ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టామని, ఇది గత ఏడాది జనవరి కంటే 48 శాతం అధికమని చెప్పారు.
ఈ తనిఖీల్లో 609 మంది అక్రమ వలసదారులను అరెస్టు చేశామని, గత ఏడాది జనవరిలో అరెస్టుల కంటే ఈ సంఖ్య 73 శాతం అధికమని తెలిపారు. అక్రమ వలసదారులను గుర్తించేందుకు చేస్తున్న తనిఖీల్లో భారతీయ రెస్టారెంట్లు, నెయిల్ బార్లు, దుకాణాలు, కార్ వాష్ సెంటర్లపై భద్రతా సిబ్బంది ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. హంబర్‌సైడ్‌లోని ఓ భారతీయ రెస్టారెంట్‌లో తనిఖీలు చేసి ఏడుగురు అక్రమ వలసదారులను అరెస్టు చేశామని, నలుగురిని దేశం నుంచి పంపించేశామని హోంశాఖ కార్యాలయం తన ప్రకటనలో ప్రత్యేకంగా ప్రస్తావించింది.
అక్రమ వలసలకు ముగింపు: యూకే ప్రధాని
అక్రమ వలసలపై యూకే ప్రధాని కీర్ స్టార్మర్ సోమవారం కీలక ప్రకటన చేశారు. ‘చాలా ఎక్కువ మంది యూకేకు అక్రమంగా వచ్చి, పని చేయగలుగుతున్నారు. దీనికి మేము ముగింపు పలుకుతున్నాం’ అని ఆయన ‘ఎక్స్’లో పేర్కొన్నారు. అక్రమ వలసలను అడ్డుకునేందుకు భద్రతా సిబ్బందికి అదనపు అధికారాలు కట్టబెడుతూ యూకే ప్రభుత్వం కొత్తగా సరిహద్దు రక్షణ, శరణు, వలసల బిల్లును తీసుకువస్తున్నది.
భారతీయుల సంఖ్య ఎక్కువే!
యూకేకు అక్రమంగా వలస వెళ్తున్న వారిలో భారతీయుల సంఖ్య ఏటేటా పెరుగుతున్నది. 2023లో దాదాపు వెయ్యి మంది భారతీయులు చిన్న పడవలపై ప్రమాదకరంగా ఇంగ్లీష్ చానెల్‌ను దాటి యూకేలో అడుగుపెట్టారనే అంచనాలు ఉన్నాయి. ఈ సంఖ్య 2022 కంటే రెట్టింపు కావడం గమనార్హం. యూకేలో ఆశ్రయం కోరిన భారతీయుల సంఖ్య 2023లో మొదటిసారి ఐదు వేలు దాటింది.