IndiaUS Deal : అమెరికా డీల్ ఎఫెక్ట్.. ఇన్వెస్టర్లకు కాసుల పంట.. ఈ షేరు కొన్నోళ్లకు పండగే పండుగ.
IndiaUS Deal : భారత్, అమెరికా మధ్య వాణిజ్య యుద్ధానికి తెరపడటం భారతీయ కంపెనీలకు వరంగా మారింది. ప్రధానంగా టెక్స్‌టైల్ రంగంలోని కంపెనీలకు ఈ ఒప్పందం భారీ లాభాలను తెచ్చిపెడుతోంది. ఇందులో భాగంగా గోకల్‌దాస్ ఎక్స్‌పోర్ట్స్ షేర్లు గత రెండు రోజులుగా ట్రేడింగ్‌లో అదరగొడుతున్నాయి. కేవలం రెండే రోజుల్లో ఈ షేరు ధర ఏకంగా 43 శాతం పెరిగింది. వరుసగా రెండు రోజులు 20 శాతం చొప్పున అప్పర్ సర్క్యూట్ నమోదు చేయడం విశేషం. ఫిబ్రవరి 3న డీల్ వార్త బయటకు వచ్చినప్పటి నుండి ఈ షేరు పరుగు ఆకలి కావడం లేదు.
గోకల్‌దాస్ ఎక్స్‌పోర్ట్స్ ఆదాయంలో సుమారు 70 శాతం వాటా ఒక్క అమెరికా నుంచే వస్తుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌పై ఉన్న టోటల్ టారిఫ్‌ను 50 శాతం నుండి 18 శాతానికి తగ్గించడంతో, ఇకపై భారతీయ దుస్తులు అమెరికా మార్కెట్లో చాలా తక్కువ ధరకే లభిస్తాయి. దీనివల్ల కంపెనీకి కొత్త ఆర్డర్లు రావడమే కాకుండా, లాభాల మార్జిన్ కూడా గణనీయంగా పెరుగుతుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. అందుకే ఫలితాలు అంతంత మాత్రంగా ఉన్నా, భవిష్యత్తుపై నమ్మకంతో షేర్లను ఎగబడి కొంటున్నారు.
బుధవారం ట్రేడింగ్‌లో గోకల్‌దాస్ షేరు రూ.832.85 స్థాయికి చేరుకుంది. ఫిబ్రవరి 2వ తేదీ ధరతో పోలిస్తే, కేవలం రెండు రోజుల్లోనే ఒక షేరుపై రూ.251 లాభం వచ్చింది. అంటే వంద షేర్లు ఉన్నవాళ్లకు రెండు రోజుల్లోనే రూ.25 వేల లాభం అన్నమాట. ఇక దీర్ఘకాలిక ఇన్వెస్టర్ల విషయానికి వస్తే, గత 5 ఏళ్లలో ఈ కంపెనీ ఏకంగా 922 శాతం రిటర్న్స్ ఇచ్చింది. అంటే ఐదేళ్ల క్రితం ఇందులో ఒక లక్ష రూపాయలు పెట్టిన వ్యక్తికి ఇప్పుడు అది రూ. 10 లక్షలకు పైగా పెరిగిందన్నమాట.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. డిసెంబర్ 2025 త్రైమాసికంలో కంపెనీ నికర లాభం భారీగా తగ్గి రూ.15 కోట్లకు పడిపోయింది. అయినప్పటికీ విదేశీ ఇన్వెస్టర్లు ఈ కంపెనీపై గట్టి నమ్మకంతో ఉన్నారు. ఎఫ్ఐఐలు తమ వాటాను 22.9 శాతం నుంచి 23.7 శాతానికి పెంచుకున్నారు. ఇప్పుడు అమెరికా డీల్ తోడవ్వడంతో ఈ కంపెనీ దశ తిరగబోతోందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ఒప్పందం కేవలం టెక్స్‌టైల్ మాత్రమే కాకుండా జ్యువెలరీ, ఐటీ, ఇతర ఎగుమతి రంగాలపై కూడా సానుకూల ప్రభావం చూపనుంది.