US Passport: బలహీనపడిన యూఎస్ పాస్‌పోర్ట్.. 12వ స్థానానికి పతనం
20 ఏళ్లలో తొలిసారి టాప్ 10 జాబితా నుంచి ఔట్
ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితాలో అగ్రరాజ్యం అమెరికాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత 20 ఏళ్లలో మొదటిసారిగా యూఎస్ పాస్‌పోర్ట్ టాప్ 10 జాబితా నుంచి బయటకు వచ్చింది. అంతర్జాతీయ వాయు రవాణా సంస్థ (IATA) డేటా ఆధారంగా హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో అమెరికా 12వ స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం మలేషియాతో కలిసి యూఎస్ ఈ స్థానంలో ఉంది.
ఒకప్పుడు, అంటే 2014లో, ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్న అమెరికా పాస్‌పోర్ట్ హోల్డర్లు ఇప్పుడు కేవలం 180 దేశాలకు మాత్రమే వీసా లేకుండా ప్రయాణించగలుగుతున్నారు. మరోవైపు, ఈ జాబితాలో సింగపూర్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. సింగపూర్ పాస్‌పోర్ట్‌తో 193 దేశాలకు వీసా ఫ్రీ సదుపాయంతో వెళ్లవచ్చు. ఆ తర్వాత స్థానాల్లో దక్షిణ కొరియా (190), జపాన్ (189) ఉన్నాయి.
అమెరికా ర్యాంక్ పడిపోవడానికి పలు దేశాలు తమ వీసా నిబంధనలను మార్చడమే ప్రధాన కారణమని నివేదిక స్పష్టం చేసింది. ఈ ఏడాది బ్రెజిల్ వీసా రహిత ప్రవేశాన్ని రద్దు చేయడం, వీసా అవసరం లేని దేశాల జాబితాలో అమెరికాను చైనా చేర్చకపోవడం, మయన్మార్, పపువా న్యూగినియా వంటి దేశాలు కొత్త ప్రవేశ ఆంక్షలు విధించడం యూఎస్ ర్యాంక్‌పై ప్రభావం చూపాయి. తాజాగా వియత్నాం, సోమాలియా కూడా అమెరికన్లకు వీసా నిబంధనలను కఠినతరం చేశాయి.
ఈ విషయంలో యూకే పరిస్థితి కూడా బాగోలేదు. గతంలో టాప్‌లో ఉన్న బ్రిటన్, ఇప్పుడు ఆరో స్థానం నుంచి ఎనిమిదో స్థానానికి పడిపోయింది.
ఆసక్తికరంగా, హెన్లీ ఓపెన్‌నెస్ ఇండెక్స్ ప్రకారం, ఇతర దేశాల పౌరులను ఆహ్వానించడంలో అమెరికా చాలా వెనుకబడి ఉంది. అమెరికా పౌరులకు 180 దేశాలు వీసా ఫ్రీ ప్రయాణ సౌకర్యం కల్పిస్తుండగా, అమెరికా మాత్రం కేవలం 46 దేశాల పౌరులను మాత్రమే వీసా లేకుండా తమ దేశంలోకి అనుమతిస్తోంది. దీంతో ఈ జాబితాలో అమెరికా 77వ స్థానంలో నిలిచింది.
మరోవైపు చైనా ఈ విషయంలో వేగంగా దూసుకెళుతోంది. గత పదేళ్లలో చైనా తన పాస్‌పోర్ట్ ర్యాంకును 94 నుంచి 64కు మెరుగుపరుచుకుంది. అంతేకాకుండా, 76 దేశాల పౌరులకు వీసా రహిత ప్రవేశం కల్పిస్తూ ఓపెన్‌నెస్ ఇండెక్స్‌లో 65వ స్థానంలో నిలిచి అమెరికాను అధిగమించింది.