Visa : వీసా కావాలంటే ఫిట్‌గా ఉండాల్సిందే.. లావుగా ఉండి, షుగర్ ఉన్నవారికి నో ఎంట్రీ.

Update: 2025-11-08 07:00 GMT

Visa : ప్రపంచవ్యాప్తంగా వలసదారులకు స్వర్గధామంగా భావించే అమెరికా తాజాగా వీసాల విషయంలో కఠినమైన నిబంధనలను అమలు చేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే H-1B వీసా వంటి వాటిపై ఆంక్షలు అమలు చేస్తున్న అమెరికా ప్రభుత్వం, ఇప్పుడు వీసా దరఖాస్తుదారుల ఆరోగ్యంపై కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. దీని ప్రకారం ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు వంటి ఆరోగ్య సమస్యలు ఉన్న విదేశీయులకు వీసా నిరాకరించే ప్రమాదం ఉంది. ఈ కొత్త మార్గదర్శకాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికన్ రాయబార కార్యాలయాలకు పంపారు, ఇది వీసా ఆశావహులకు ఆందోళన కలిగించే విషయం.

అమెరికా ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన వీసా మార్గదర్శకాలలో విదేశీ పౌరులు వీసా పొందడానికి వారి ఆరోగ్య పరిస్థితిని అత్యంత కీలకంగా పరిగణించాలని అమెరికన్ రాయబార కార్యాలయాలకు స్పష్టంగా సూచించింది. గతంలో కూడా వీసా దరఖాస్తుదారులకు వైద్య పరీక్షలు ఉండేవి, కానీ చిన్న ఆరోగ్య సమస్యలను పట్టించుకునేవారు కాదు. గైడ్‌లైన్స్‌లో కూడా దీని గురించి స్పష్టంగా ప్రస్తావన ఉండేది కాదు.

ఇప్పుడు కొత్త మార్గదర్శకాల్లో ఆరోగ్య సమస్యలను స్పష్టంగా పేర్కొనడం వల్ల, వీసా అధికారులు దరఖాస్తుదారుల అనారోగ్య సమస్యలను గతంలో కంటే సీరియస్‌గా పరిగణించి, వీసాను తిరస్కరించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొత్త మార్గదర్శకాల ప్రకారం.. ఈ కింది ఆరోగ్య సమస్యలు ఉన్న దరఖాస్తుదారులకు వీసా నిరాకరణ ఎదురయ్యే అవకాశం ఉంది.

గుండె జబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధులు, క్యాన్సర్, మధుమేహం, నరాల సంబంధిత వ్యాధులు, మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా తనిఖీ చేయబడతారు. ముఖ్యంగా ఊబకాయం వల్ల ఆస్తమా, రక్తపోటు వంటి ఇతర వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున, ఊబకాయాన్ని కూడా వీసా అధికారులు పరిశీలించాలని మార్గదర్శకాల్లో సూచించారు. అమెరికా ప్రభుత్వం అనారోగ్యంతో ఉన్న వలసదారులను అనుమతించకపోవడానికి ప్రధాన కారణం, దేశంపై పడే ఆర్థిక భారం.

అమెరికా ప్రభుత్వం తమ నివాసితుల ఆరోగ్యం కోసం పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేస్తుంది. అక్కడ అనేక ఆరోగ్య బీమా పథకాలకు ప్రభుత్వం నుంచి సబ్సిడీ లభిస్తుంది. అందువల్ల, అనారోగ్యంతో ఉన్న వలసదారులు దేశంలోకి వస్తే, వారి ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వంపై వేల డాలర్ల భారం పడుతుందని అంచనా వేసింది. ఈ ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికే అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషిస్తున్నారు.

ఒకవేళ దరఖాస్తుదారులకు ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ, వారికి వీసా నిరాకరించే పరిస్థితి వస్తే, వారికి ఒక మినహాయింపు అవకాశం కూడా ఉంది. దరఖాస్తుదారులు, తమ ఆరోగ్య సమస్యల చికిత్స కోసం అమెరికా ప్రభుత్వ సాయం లేకుండా తామే సొంతంగా ఖర్చు పెట్టుకోగల ఆర్థిక స్థోమత ఉందని నిరూపించుకోగలిగితే, వారికి వీసా మంజూరు చేసే అవకాశం ఉంటుంది. అమెరికాలో ప్రైవేట్‌గా చికిత్స చేయించుకోవడానికి చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి ఆ ఖర్చు భరించే సామర్థ్యం ఉన్నవారికే ఈ మినహాయింపు వర్తిస్తుంది.

Tags:    

Similar News