Tulsi Gabbard: ఇస్లామిజం ప్రపంచ భద్రతకు అతి పెద్ద ముప్పు..తులసీ గబ్బార్డ్

ఆస్ట్రేలియాలో ఉగ్ర దాడిపై అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..

Update: 2025-12-17 04:45 GMT

 ఆస్ట్రేలియాలో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడిపై అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇస్లామిజం అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా స్వేచ్ఛ, భద్రత, శ్రేయస్సుకు అతి పెద్ద ముప్పుగా మారుతుందని ఆరోపించింది. ఆస్ట్రేలియాలో ఇస్లామిస్టుల భారీ చొరబాటు వల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి.. ఈ దాడి ఎవరినీ ఆశ్చర్యపర్లలేదని ఆమె పేర్కొన్నారు. అయితే, యూరప్ పరిస్థితి ఇప్పటికే అదుపు తప్పింది.. ఆస్ట్రేలియాలో కూడా అదే దారిలో పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అయితే, అమెరికాకు ఇంకా సమయం ఉంది.. కానీ అది ఎక్కువకాలం ఉండదని తులసీ గబ్బార్డ్ వెల్లడించింది.

ఇక, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలకు తులసీ గబ్బార్డ్ సపోర్ట్ ఇచ్చారు. యూఎస్ సరిహద్దులను భద్రపరచడంతో పాటు అనుమానిత ఉగ్రవాదులను బహిష్కరించడం, అమెరికన్ల భద్రతకు ముప్పు కలిగించే ధృవీకరణ లేని పౌరులను అడ్డుకోవడంపై ట్రంప్ ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పుకొచ్చింది. సకాలంలో కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే అమెరికా కూడా యూరప్, ఆస్ట్రేలియా ఎదుర్కొంటున్న పరిస్థితులనే ఎదుర్కొనే ప్రమాదం ఉందని గబ్బార్డ్ హెచ్చరించారు.

అయితే, డిసెంబర్ 14వ తేదీన ఆస్ట్రేలియాలోని సిడ్నీ బోండి బీచ్ దగ్గర యూదు సమాజం హనుక్కా పండుగ జరుపుకుంటున్న సమయంలో ఇద్దరు ఉగ్రవాదులు అకస్మాత్తుగా దాడి చేసి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సుమారు 15 మంది మరణించగా, అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో ఒక అనుమానితుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనను ఆస్ట్రేలియా పోలీసులు ఉగ్రవాద దాడిగా భావిస్తు్న్నారు.

Tags:    

Similar News