మయన్మార్ సైన్యానికి అమెరికా అధ్యక్షుడు బైడెన్ వార్నింగ్
మయన్మార్ మిలిటరీ వెనక్కి తగ్గకుంటే ఆ దేశంపై కఠిన ఆంక్షలు విధిస్తామని హెచ్చరిక;
మయన్మార్ సైన్యానికి అమెరికా అధ్యక్షుడు బైడెన్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికల్లో ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా చర్యలు చేపట్టవద్దని సూచించారు. ఆ దేశ కీలక నేత, నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ నాయకురాలు ఆంగ్ సాన్ సూకీ సహా ఆ పార్టీ కీలక నేతలను ఆ దేశ సైన్యం అదుపులోకి తీసుకోవడాన్ని ఐక్యరాజ్య సమితి, అమెరికా ఖండించాయి. మయన్మార్ మిలిటరీ వెనక్కి తగ్గకుంటే ఆ దేశంపై కఠిన ఆంక్షలు విధిస్తామని హెచ్చరించాయి. మయన్మార్ సైన్యం చర్యలు ప్రజాస్వామ్యంపై దాడిగా వర్ణించాయి.
మయన్మార్ పార్లమెంట్‌కు గత నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఆంగ్‌సాన్ సూకీకి చెందిన నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీ 476 స్థానాలకు గానూ.. 396 స్థానాలు కైవసం చేసుకుని మరోసారి అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు చట్టసభ్యులు సోమవారం నేపిడాలో సమావేశం అయ్యేందుకు నిర్ణయించారు. అయితే ఎన్నికల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని భావిస్తూ ఆ దేశం సైన్యం ఆంగ్‌సాన్ సూకీ సహా ఇతర కీలక నేతలను అదుపులోకి తీసుకొని గృహనిర్బంధం విధించింది. ఏడాది పాటు పాలన తమ నియంత్రణలోనే ఉంటుందని మయన్మార్ సైన్యం వెల్లడించింది.