America: పాక్‌కు రహస్యంగా మిస్సైల్ ఎక్విప్‌మెంట్ సరఫరా..
మూడు చైనా కంపెనీలపై అమెరికా నిషేధం..!;
రహస్యంగా పాకిస్థాన్‌కు బాలిస్టిక్ క్షిపణి టెక్నాలజీ, సామాగ్రిని సరఫరా చేస్తున్న చైనా కంపెనీలపై అమెరికా కొరడా ఝలిపించింది. చైనాకు చెందిన కంపెనీలపై అగ్రరాజ్యం చర్యలు తీసుకుంది. అంతర్జాతీయ అణ్వస్త్రవ్యాప్తి నిరోధక, నిరాయుధీకరణ పాలసీ కింద ఈ ఆంక్షలు విధించినట్లు అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా కి చెందిన మూడు కంపెనీలు పాక్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమానికి సంబంధించిన వస్తువులను సరఫరా చేశాయని విదేశాంగశాఖ పేర్కొంది. అందుకే వాటిపై నిషేధం విధిస్తున్నట్లు పేర్కొంది.
చైనాకు చెందిన జనరల్ టెక్నాలజీ లిమిటెడ్, బీజింగ్ లువో లువో టెక్నాలజీ డెవలప్‌మెంట్ కో లిమిటెడ్, చెంగ్జూ యుటెక్ కంపోసైట్ లిమిటెడ్ కంపెనీలపై ఆంక్షలు విధించింది. ఈ మూడు సంస్థలు పాక్ బాలిస్టిక్ మిస్సైల్ కార్యాక్రమానికి సహకారం అందజేస్తున్నట్టు అమెరికా విదేశాంగ శాఖ గుర్తించింది. డ్రాగన్ దేశం వక్రబుద్ధితో పాక్ సైనిక ఆధునికీకరణలో భాగంగా ఆయుధాలు, రక్షణ పరికరాలను సరఫరా చేస్తున్నది. అయితే, మూడు కంపెనీల్లో జనరల్ టెక్నాలజీ లిమిటెడ్, జీబింగ్ లువో లువో టెక్నాలజీ డెవలప్‌మెంట్ కంపెనీ లిమిటెడ్, చాంగ్ జౌ యుటెక్ కంపోజిట్ కంపెనీ లిమిటెడ్ ఉన్నాయి. సామూహిక విధ్వంసం సృష్టించే ఆయుధాల విస్తరణ, పంపిణీ, సంబంధిత పరికరాల సేకరణ ఎక్కడ జరిగినా.. అలాంటి ఆందోళన కార్యక్రమాలకు వ్యతిరేకిస్తూ వాటిని అమెరికా అడ్డుకుంటుందని ఈ నిర్ణయం నిరూపించినట్లు పేర్కొంది.
జనరల్ టెక్నాలజీ లిమిటెడ్ బాలిస్టిక్ క్షిపణి రాకెట్ ఇంజిన్‌లో ఉపయోగించే బ్రేజింగ్ మెటీరియల్‌ను.. లువో లువో టెక్నాలజీ డెవలప్‌మెంట్ మాండ్రెల్స్, ఇతర యంత్రాలను.. చాంగ్‌జౌ కంపెనీ D-గ్లాస్ ఫైబర్, క్వార్ట్జ్ ఫాబ్రిక్, హై సిలికా ఫాబ్రిక్ సరఫరాను చేశాయి. ఆయా కంపెనీలు సరఫరా చేసినవన్నీ క్షిపణి వ్యవస్థలు ఉపయోగిస్తుంటారు. అయితే, అమెరికా చర్యలపై వాషింగ్టన్‌లోని చైనా ఎంబసీ ఇంత వరకు స్పందించలేదు. ఆంక్షలు ఎదుర్కొంటున్న కంపెనీలు సైతం దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.