కాబుల్‌లో మళ్లీ ఉగ్రదాడి జరగొచ్చని అమెరికా హెచ్చరిక..!
కాబుల్‌లో మళ్లీ ఉగ్రదాడి జరగొచ్చని అమెరికా అధ్యక్షుడు బైడెన్ హెచ్చరించారు. 24 గంటల నుంచి 36 గంటల్లో ఎయిర్‌పోర్ట్ టార్గెట్‌గా ఐసిస్-కె టెర్రర్ ఎటాక్‌కి ప్లాన్ చేసినట్టు చెప్పారు.;
కాబుల్‌లో మళ్లీ ఉగ్రదాడి జరగొచ్చని అమెరికా అధ్యక్షుడు బైడెన్ హెచ్చరించారు. 24 గంటల నుంచి 36 గంటల్లో ఎయిర్‌పోర్ట్ టార్గెట్‌గా ఐసిస్-కె టెర్రర్ ఎటాక్‌కి ప్లాన్ చేసినట్టు చెప్పారు. సూసైడ్ బాంబ్ ఎటాక్‌కి అత్యంత ఎక్కువ అవకాశాలు ఉన్నాయని, అంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. అటు, ఉగ్రవాద సంస్థ ఐసిస్-ఖోరసాన్‌పై డ్రోన్ దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఆఫ్గానిస్తాన్ నుంచి నుంచి బలగాల ఉపసంహరణ ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్న నేపథ్యంలో.. ఆ పని వేగంగా జరుగుతోంది.
కాబుల్ విమానాశ్రయం 3 గేట్ల వద్ద సెక్యూరిటీని అమెరికా సంకీర్ణ దళాలు ఇప్పుడు తాలిబన్లకు అప్పగించాయి. రాడార్ సిస్టం ఉన్న ప్రాంతం మినహా మిగతాదంతా తాలిబన్ల ఆధీనంలోనే ఉంది. కాబుల్ నుంచి ఇప్పటికి లక్షా 10 వేల మందిని తరలించిన అమెరికా, మంగళవారం కల్లా తిరిగి వెళ్లిపోయేందుకు ఆపరేషన్ పూర్తి చేస్తోంది. ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న వెయ్యి మందిని తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీరు కాకుండా 4 వేల మంది సైనికులు ఉన్నారు. రెండ్రోజుల్లో అంతా ఖాళీ చేసి USకి వెళ్తారు.
గురువారం నాటి మానవబాంబు దాడిలో 180 మంది చనిపోయారు. వీళ్లలో అమెరికన్ సైనికులు కూడా 13 మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో ఐసిస్ ఉగ్రవాదుల శిబిరంపై డ్రోన్ దాడులతో విరుచుకుపడిన అమెరికా.. మరికొన్ని ఎటాక్‌లు తప్పవని హెచ్చరికలు చేసింది. అటు, ఆఫ్గాన్ నుంచి బ్రిటన్ దళాలు వెనుతిరిగాయి. చిట్టచివరి బ్యాచ్ కూడా నిన్న రాత్రి తిరిగి వెళ్లింది. వీళ్లతో కలిపి మొత్తం 15 వేల మందిని అక్కడి నుంచి UK తరలించారు. దాదాపు 20 ఏళ్లు నాటో సంకీర్ణదళాలు ఆఫ్గాన్‌లో మోహరించినా.. చివరికి అక్కడి నుంచి వెళ్లాలని కొద్ది నెలల కిందటే నిర్ణయించారు. ఈ సైన్యం ఓపక్క ఖాళీ చేస్తుండగానే.. అటు తాలిబన్లు మొత్తం ఆక్రమించుకుని అధికారాన్ని కూడా హస్తగతం చేసుకున్నారు.