USA: వలసదారులు నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ లాస్ ఏంజెల్స్‌లో అల్లర్లు..
రణరంగంగా మారిన కాలిఫోర్నియా..;
అమెరికా అధ్యక్షుడు వలసదారులను నిర్బంధించడంపై కాలిఫోర్నియా అట్టుడుకుతోంది. లాస్ ఎంజెల్స్‌లో నిరసనకారులు విధ్వంసం సృష్టిస్తున్నారు. గత నాలుగు రోజులుగా జరుగుతున్న అల్లర్లను కంట్రోల్ చేయడానికి ట్రంప్ సర్కార్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. వందలాది మంది అరెస్టులు జరిగాయి. మరోవైపు, నిరసనకారులు లూటీలకు పాల్పడుతున్నారు. ఆపిల్ స్టోర్స్, జ్యువెల్లరీ స్టోర్స్ లక్ష్యంగా లూటీలు చేస్తున్నారు.
వేలాది మంది నిరసనకారులు రోడ్లను ఆక్రమించారు. పోలీసు వ్యాన్లను తగలబెట్టడంతో పాటు పోలీసుల పైకి రాళ్లు రువ్వారు. 2000 మంది నేషనల్ గార్డ్స్ లాస్ ఎంజెల్స్‌లో మోహరించారు. 700 మంది మెరైన్ గార్డ్స్ అల్లర్లను అడ్డుకునేందు ప్రయత్నిస్తున్నారు. నిరసనకారుల్ని చెదరగొట్టేందుకు రబ్బర్ బుల్లెట్స్, టియర్ గ్యాస్‌ని ఉపయోగిస్తున్నారు.
లాటిన్ జనాభా ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో అనధికారిక వలసదారుల్ని ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేసిన తర్వాత అల్లర్లు చెలరేగాయి. ముందుగా శాంతియుతంగా నిరసనలు ప్రారంభమైనప్పటికీ, సోమవారం హింసాత్మకంగా మారాయి. ఇమ్మిగ్రేషన్ మరియు కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) అధికారులు అక్రమ వలసదారులపై దాడులు నిర్వహించడాన్ని ఆందోళనకారులు వ్యతిరేకిస్తున్నారు.