Maria Corina Machado: నార్వేలో ప్రత్యక్షమైన నోబెల్‌ శాంతి గ్రహీత మచాడో..

రహస్యంగా నార్వే చేరుకున్న వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు

Update: 2025-12-11 04:45 GMT

చాలా రోజుల తర్వాత వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాడో బహిరంగంగా కనిపించారు. బుధవారం అర్ధరాత్రి నార్వే రాజధాని ఓస్లోలోని గ్రాండ్ హోటల్ దగ్గర ప్రత్యక్షమయ్యారు. హోటల్‌లోని బాల్కనీ దగ్గర అందరికీ చేతులు ఊపుతూ.. అభివాదం చేస్తూ.. చేతులు ఎత్తి నమస్కరిస్తూ కనిపించారు. చాలా ఉల్లాసంగా.. ఉత్సాహంగా కనిపించారు. మద్దతుదారులతో కలిసి పాటలు కూడా పాడారు. ఈ ఏడాది జనవరిలో ప్రత్యక్షమైన ఆమె… తిరిగి ఇన్ని నెలల తర్వాత పబ్లిక్‌గా కనిపించారు.

ఈ ఏడాది అనూహ్యంగా నోబెల్ శాంతి బహుమతి మచాడోను వరించింది. బుధవారం నార్వేలో నోబెల్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి మచాడో గైర్హాజరయ్యారు. ఆమె చాలా రోజుల నుంచి అజ్ఞాతంలో ఉన్నారు. అయితే అవార్డు తీసుకునేందుకు దేశం దాటి వెళ్లకుండా ఆమెపై వెనిజులా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అవార్డు తీసుకునేందుకు దేశం దాటి వెళ్తే పరారీలో ఉన్న నేరస్థురాలిగా పరిగణిస్తామంటూ వెనిజులా అటార్నీ జనరల్ హెచ్చరించారు.

అయినా కూడా మచాడో అత్యంత రహస్యంగా నార్వేలోని ఓస్లోకు చేరుకున్నారు. గ్రాండ్ హోటల్‌లో హఠాత్తుగా ప్రత్యక్షమయ్యారు. బాల్కనీ నుంచి బయటకు వచ్చి అందరికీ అభివాదం చేశారు. నోబెల్ శాంతి బహుమతి తీసుకునేందుకు వెళ్తే ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయో తనకు తెలుసు అని మీడియాతో అన్నారు. అయినా కూడా రహస్యంగా నార్వే చేరుకున్నారు. తనను చూసేందుకు వచ్చిన మద్దతుదారులను కలిసేందుకు బారికేడ్లు దాటుకుంటూ వెళ్లారు. మరియా.. మరియా అంటూ పెద్ద పెద్దగా అరుపులు.. కేకలు వినిపించాయి.

మచాడో.. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. నియంతృత్వానికి వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు. చాలా కాలంగా ఆమె ప్రతిపక్ష నాయకురాలిగా ఉన్నారు. ఇక అధ్యక్ష ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా నిషేధం విధించారు. మొత్తానికి శాంతియుతంగా పోరాటం చేస్తున్న ఆమెకు నోబెల్ శాంతి బహుమతి వరించింది.

Tags:    

Similar News