Yevgeny Prigozhin: వ్యాగ్నర్ గ్రూప్ అధినేత మృతి
విమాన ప్రమాదంలో వ్యాగ్నర్ గ్రూప్ అధినేత ప్రిగోజిన్, సంస్థ సహవ్యవస్థాపకుడు మృతి;
రష్యాలో జరిగిన ఓ విమాన ప్రమాదంలో వాగ్నర్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్తో పాటు మరో 9 మంది మరణించారు. బుధవారం మాస్కో నుంచి సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు బయలుదేరిన విమానం ట్వెర్ ప్రాంతంలోని కుజెంకినో ప్రాంతంలో కూలిపోయినట్టు రష్యా అత్యవసర వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రష్యా అధినాయకత్వంపై తిరుగుబాటు చేసి ఆపై రాజీపడ్డ కొన్ని నెలలకే ప్రిగోజిన్ మరణించడం గమనార్హం.
రష్యా దేశంలోని అత్యంత శక్తివంతమైన కిరాయి సైనికుడు యెవ్జెనీ ప్రిగోజిన్ బుధవారం సాయంత్రం మాస్కోకు ఉత్తరాన కుప్పకూలిన విమానంలో మరణించాడని రష్యా అధికారులు తెలిపారు. రష్యా విమానయాన శాఖ రాస్‌ఏవియేట్సియా ప్రకటన ప్రకారం, ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 10 మంది ఉన్నారు. వారందరి పేర్లను రాస్ ఏవియేట్సియా ప్రకటించింది. ఈ ప్రమాదంలో వ్యాగ్నర్ గ్రూప్ సహవ్యవస్థాపకుడు, ప్రిగోజిన్‌కు సన్నిహితుడైన డిమిట్రీ యూట్కిన్ కూడా మరణించారు. ఈ ప్రమాదంపై రష్యా దర్యాప్తు ప్రారంభించింది. ప్రమాదంలో ముగ్గురు సిబ్బంది సహా మొత్తం 10 మంది చనిపోయినట్టు పేర్కొంది. ఇప్పటి వరకూ 8 మృతదేహాలను గుర్తించినట్టు తెలిపింది.
విమానంపై మిసైళ్ల దాడి జరగడంతో అది కూలిపోయి ఉంటుందని రష్యా మీడియా వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు, గ్రే జోన్‌లోని వాగ్నెర్‌తో అనుసంధానమైన ఒక టెలిగ్రామ్ ఛానల్ ప్రిగోజిన్ మరణించినట్లు ప్రకటించింది. అతన్ని హీరో,దేశభక్తుడిగా కీర్తించింది. అతను గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో మరణించాడని టెలిగ్రామ్ ఛానల్ పేర్కొంది. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని వాగ్నెర్ కార్యాలయాలు ఉన్న భవనం చీకటి పడిన తర్వాత ప్రిగోజిన్ మృతికి సంతాప సూచకంగా ఒక పెద్ద శిలువను ప్రదర్శించారు. రష్యా అధ్యక్షుడిపైనే తిరుగుబాటు బావుటా ఎగురవేసి కలకలం రేపిన ప్రిగోజిన్ మరణంతో వ్యాగ్నర్ గ్రూప్ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి.
గత జూన్‌లో రష్యా అధినేత పుతిన్‌పై వాగ్నర్ గ్రూపు చేసిన ఒక్కరోజు తిరుగుబాటు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తన సేనలను మాస్కో దిశగా నడిపిస్తున్నట్టు ప్రకటించిన కొద్దిసేపటికే ప్రిగోజిన్ వెనక్కి తగ్గారు. రష్యా సైన్యంపై ఆరోపణలు చేసిన ఆయన.. తమకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని దుయ్యబట్టారు. అయితే, వెంటనే ఆయన యూటర్న్ తీసుకున్నారు. తర్వాత బెలారస్‌కు పారిపోయారు. ఇటీవల పుతిన్‌తో భేటీ అయ్యారు. వాగ్నర్ గ్రూపు సభ్యులు రిటైరవడానికిగానీ, రష్యా సైన్యంలో చేరడానికిగానీ అనుమతించారు.