Israel-Hamas war: కాల్పుల విరమణకు హమాస్ ఓకే
రఫాపై దాడి ప్రకటన వెంటనే అంగీకారం;
ఈజిప్టు, ఖతార్ ప్రతిపాదించిన కాల్పుల విరమణకు హమాస్ అంగీకరించింది. శాశ్వత కాల్పుల విరమణకు తప్ప మరో ప్రతిపాదనకు అంగీకరించబోమంటూ ఆదివారం చర్చల నుంచి వైదొలగిన హమాస్.. రఫాపై ఇజ్రాయెల్ దాడులు చేసిన కొంతసేపటికే దిగొచ్చింది. హమాస్ ప్రకటనతో గాజా ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. వీధుల్లోకి వచ్చి నృత్యాలు చేశారు. కాల్పుల విరమణకు సంబంధించిన షరతులు ఇంకా తెలియరాలేదు. సీజ్‌ఫైర్‌ను తమ నేత ఇస్మాయిల్ హనియా అంగీకరించినట్లు హమాస్ ప్రకటనలో తెలిపింది. ఈ విషయాన్ని ఆయన ఖతార్ ప్రధానికి, ఈజిప్టు ఇంటెలిజెన్స్ మంత్రికి ఫోన్ చేసి చెప్పినట్లు పేర్కొంది.
గతంలో 40 రోజుల కాల్పుల విరమణ. 33 మంది బందీల విడుదల. పాలస్తీనా ఖైదీల అప్పగింత ప్రతిపాదనను ఇజ్రాయెల్ సమర్పించింది. అయితే హమాస్ మాత్రం తొలి నుంచి శాశ్వత కాల్పుల విరమణే కోరింది. ఈ క్రమంలో తమ ప్రతిపాదనను అంగీకరించకపోతే రఫాలో భూతల దాడులు చేస్తామని ఇజ్రాయెల్ హెచ్చరించింది. అదే సమయంలో భారీ వైమానిక దాడి కూడా చేసి 22 మందిని బలిగొంది. మరిన్ని దాడులు తప్పవన్న పరిస్థితుల్లో సీజ్‌ఫైర్‌కు అంగీకరిస్తున్నట్లు హమాస్ ప్రకటించింది. తాజా పరిస్థితులను అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్‌లో వివరించారు.
ఇజ్రాయెల్- హమాస్ పోరులో ఇప్పటికే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. రూ.లక్షల కోట్లలో ఆస్తి నష్టం జరిగింది. అనేక మంది పొట్టచేతపట్టుకొని సాయం కోసం అర్థిస్తున్నారని ఇప్పటికే పలుసార్లు ఐరాస తెలిపింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ తీరును అగ్రరాజ్యం అమెరికా సహా పలు దేశాలు తప్పుబడుతున్నాయి. సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. నరమేధానికి పాల్పడుతోందన్న ఆరోపణలతో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్‌లోని ఓ విభాగంపై అమెరికా ఆంక్షలు కూడా విధించింది. కొన్ని సంస్థలు, వ్యక్తులపైనా చర్యలకు ఉపక్రమించింది. రఫాలోనూ భూతల దాడులకు పాల్పడితే తమ సహకారం ఉండబోదని హెచ్చరించింది. బ్రిటన్ సైతం పలు సందర్భాల్లో ఈ తరహా హెచ్చరికలు చేసింది.