అత్యంత క్రూరమైన ప్రదేశం అదే: జేమ్స్ కామెరూన్
టైటాన్ పేలుడుపై జేమ్స్ కామెరూన్ ఆవేదన.... టైటానిక్ మునిగిన ప్రదేశం అత్యంత క్రూరమైనదన్న దిగ్గజ దర్శకుడు... స్నేహితుడిని కోల్పోయానన్న కామెరూన్..;
టైటానిక్ శకలాలను చూసేందుకు ఐదుగురితో వెళ్లిన టైటాన్ మినీ జలాంతర్గామి కథ విషాదాంతం కావడంపై దిగ్గజ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ స్పందించారు. 1912లో సముద్ర గర్భంలో 13 వేల అడుగుల లోతున మునిగిపోయి... చరిత్ర మిగిల్చిన సజీవ సాక్ష్యంగా ఉన్న టైటానిక్ శకలాలను ఆయన 33 సార్లు సందర్శించారు. 1995లో తొలిసారి ఓ రష్యన్ సబ్ మెరైన్ లో ప్రయాణించి టైటానిక్ మునిగిపోయిన ప్రాంతాన్ని జేమ్స్ కామెరూన్ వీడియో చిత్రీకరించి తీసుకొచ్చారు. టైటానిక్ మునిగిపోయిన ప్రదేశాన్ని ఎక్కువసార్లు సందర్శించిన వ్యక్తిగా పేరున్న జేమ్స్ కామెరూన్... టైటానిక్ మునిగిపోయిన ప్రదేశాన్ని అత్యంత క్రూరమైనదిగా అభివర్ణించారు. అయిదుగురిని బలి తీసుకున్న టైటాన్ మినీ జలాంతర్గామి ప్రమాదానికి నిర్లక్ష్యం కూడా ఓ కారణమని కామెరూన్ అన్నారు. ఈ సబ్ మెరైన్‌లో భద్రత గురించిన విషయాలను మరచిపోయారని, దాని కారణంగానే ఐదుగురు మరణించారన్నారు. ఈ విషాదం 1912లో జరిగిన టైటానిక్ షిప్ ప్రమాదాన్ని గుర్తు చేసిందన్నారు. హెచ్చరికలను పట్టించుకోకుండా జలాంతర్గామిలో టైటానిక్ శకలాల వద్దకు వెళ్లడం.. ఇంతటి విషాదాన్ని మిగిల్చిందన్నారు. ఈ ప్రమాదంలో చనిపోయిన అయిదుగురిలో తన స్నేహితుడు పాల్ హెన్రీ నార్గోలెట్ కూడా ఉన్నారని కామెరాన్ వెల్లడించాడు. తనకు 25 ఏళ్లుగా తెలిసిన వ్యక్తి ఈ ప్రమాదంలో మరణించడంపై కామెరూన్ ఆవేదన వ్యక్తం చేశాడు. టైటాన్ భద్రతపై నిపుణుల ఆందోళనలను కూడా కామెరూన్ ప్రస్తావించారు. టైటాన్ ప్రమాదం తనను దిగ్ర్భాంతికి గురిచేసిందన్న దిగ్గజ దర్శకుడు... సబ్‌మెర్సిబుల్ డిజైనర్‌గా తనకు మినీ జలాంతర్గామి భద్రతపై అవగాహన ఉందన్నాడు. 1912 ఏప్రిల్‌లో టైటానిక్ తన తొలి ప్రయాణంలో మంచుకొండను ఢీకొట్టిన మునిగిపోయింది. ఈ ప్రమాదంలో సుమారు 1500 మంది ప్రయాణికులు, సిబ్బంది మరణించారు. టైటానిక్ శిథిలాలను అట్లాంటిక్ మహా సముద్రంలో 1985లో గుర్తించారు.