AP : పోలీసుల తీరుకు నిరసనగా ఆందోళనకు దిగిన ఎమ్మెల్యే

అనంతపురం జిల్లా యల్లనూరు పోలీస్ స్టేషన్‌లో ఏకంగా ఎమ్మెల్యే ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుంది. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ.. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పీఎస్‌లో ధర్నాకు దిగారు. తన వర్గీయులపై 307 సెక్షన్, బోగతి నారాయణ రెడ్డి వర్గీయులపై 324 సెక్షన్ కింద కేసు పెట్టారంటూ పోలీస్ స్టేషన్‌లో ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆందోళన విరమించాలని తాడిపత్రి డీఎస్పీ చైతన్య నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉండి కూడా తన వర్గీయులపై హత్యాయత్నం కేసు నమోదు చేస్తుంటే చూస్తూ కూర్చోవాలా అంటూ పోలీసులపై పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెండ్రోజుల కిందట వైసీపీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. తాడిపత్రి మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ బోగతి నారాయణరెడ్డి.. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి వర్గీయులు.. పరస్పరం వేట కొడవళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com