AP : చెరువులను తలపిస్తున్న జగనన్న కాలనీలు

AP : చెరువులను తలపిస్తున్న జగనన్న కాలనీలు

ఇటీవల కురిసిన వర్షాలకు జగనన్న కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. చినుకుపడినా నీరు పోయే మార్గం లేక ముంపునకు గురవుతున్నాయి. రోజుల తరబడి ఇళ్ల నిర్మాణాల మధ్య నీరు నిలిచి వాటి నాణ్యత ప్రశ్నార్థకమైంది. కోట్లు పోసి మెరక చేసినా చాలా చోట్ల ఫలితం లేకుండా పోయింది. కొన్ని లేఅవుట్లలో మట్టి పోయకుండా వదిలేయడంతో ముంపునకు గురవుతున్నాయి.కొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాలు, చెరువు, కాలువలను ఆనుకుని, పొలాల్లోనూ పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడంతో చిరుజల్లులకే వాన నీరు చేరుతోంది.లబ్ధిదారులకు కేటాయించిన ప్లాట్ల సరిహద్దు రాళ్లు కొన్ని చోట్ల కొట్టుకుపోయాయి.

కర్నూలు జిల్లా ఆదోని శివారులోని జగనన్న లేఅవుట్‌ లో 10వేల మందికి ఇళ్ల స్థలాలిచ్చారు. 5వేల ఇళ్లను కాంట్రాక్టర్లు నిర్మిస్తున్నారు. వర్షపు నీరు వెళ్లేందుకు డ్రైన్‌ ఏర్పాటుచేయకుండా ఇంటర్నల్‌ రోడ్ల ఎత్తు పెంచేశారు. దీంతో ఇటీవల కురిసిన వర్షానికి ఇళ్ల పునాదుల చుట్టూ నీరు చేరింది. కొన్ని ఇళ్ల బేస్‌మెంట్‌ల లోనూ నీరు నిల్వ ఉంది. ఏడాదిగా వర్షం కురిసిన ప్రతిసారీ ఇదే పరిస్థితి. దీంతో కొన్ని ఇళ్ల పునాదులు దెబ్బతింటున్నాయి. బేస్‌మెంట్‌ స్థాయి వరకు కట్టిన గోడలు చెదిరిపోతున్నాయి. ప్రభుత్వం సరఫరా చేసిన ఇనుము వర్షపు నీటిలో తుప్పు పడుతోంది. ఇళ్ల నిర్మాణ నాణ్యతే ప్రశ్నార్థకమైంది. దీనిపై లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.

అటు అనపర్తి నియోజకవర్గంలో 265 మందికి ఇళ్ల స్థలాలనిచ్చారు. ఇది లోతట్టు ప్రాంతమే. రెండడుగుల మేర మట్టి పోసి మమ అనిపించారు. చిన్నపాటి వర్షానికి నీరు నిలిచి చెరువును తలపిస్తోంది. వర్షపు నీరు పోయేందుకు మార్గం లేదు. ఇంకో రెండడుగులు ఎత్తు పెంచాల్సి ఉంది. ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదు. పది మంది కూడా ఇళ్లు కట్టుకోవడం లేదు.

Tags

Read MoreRead Less
Next Story