AndhraPradesh: రోడ్ షోలపై నిషేధం; ప్రతిపక్షాల సత్తాకు భయపడేనా...!?

Andhrapradesh
AndhraPradesh: రోడ్ షోలపై నిషేధం; ప్రతిపక్షాల సత్తాకు భయపడేనా...!?
ప్రతిపక్ష పార్టీలకు పెరుగుతున్న ఆదరణకు జగన్ జడిసారా..! లోకేష్ పాదయాత్ర , పవణ్ కళ్యాణ్ వారాహి యాత్రను అడ్డుకోవడమే వ్యూహమా!?; కుప్పంలో ఇప్పటికే అమల్లోకి ఆంక్షలు; కోర్టుల జోక్యోమే పరిష్కారమా..!

కొత్త సంవత్సరంలో జగన్ సర్కారు తీసుకొచ్చిన తొలి జీవో చర్చనీయాంశగా మారింది. జీవో నెం 1 ద్వారా ఆంధ్రప్రదేశ్ లో ఇకపై ఎలాంటి రాజకీయ సభలూ, సమావేశాలు నిర్వహించరాదంటూ ప్రభుత్వం నిషేదాజ్ఞలు జారీచేసింది. ఇటీవల తెలుగుదేశం పార్టీ కందుకూరు, గుంటూరులో చేపట్టిన సమావేశాల్లో ప్రమాదవశాత్తూ కొందరు మృతిచెందిన ఘటనలే ఈ ఉత్తర్వులకు కారణమని చెబుతున్నారు. ఇక తాజా ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర, మున్సిపల్, పంచాయితీ రోడ్లపై రాలీలు చేపట్టరాదు.. రోడ్ మార్జిన్ లను రాజకీయ సమావేశాలకు వినియోగించరాదు. ముందస్తు అనుమతితో జనావాసాలకు దూరంగా, విశాల మైదానాల్లో మాత్రమే ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఏ ప్రతిపక్ష పార్టీ అయినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టాలంటే మునుపటిలా ఎక్కడంటే అక్కడ ఏర్పాటు చేసుకునే అవకాశం లేదన్నమాట.


అవగాహనే రోడ్ షో ప్రధాన ఉద్దేశం..


అసలు రోడ్ షోలు , వీధి సమావేశాల ప్రధాన ఉద్దేశమే.. ప్రజల వద్దకు వెళ్లి ఎవరికీ ఏ ఇబ్బందీ లేకుండా అయా అంశాలపై అవగాహన కల్పించడం. ఇందులో భారీ జనసమీకరణ, తరలింపులు వంటివి ఉండవు. ఇది ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిన ఆలోచనేమీ కాదు. స్వాతంత్రోద్యమ కాలం నుంచీ ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఓ వాహనంలో వివిధ గ్రామాలకు వెళ్లి కాస్త విశాలంగా ఉన్న కూడలిలో జనాలనుద్దేశించి ప్రసంగించడం ద్వారా వారి పార్టీల సందేశాలను ప్రజలకు చేరవేయడమే ప్రధాన లక్ష్యం. మరి అలాంటి సమావేశాలపై జగన్ ప్రభుత్వానికి అభ్యంతరమెందుకు? దీనివెనుక కేవలం రాజకీయ కుటిల ఎత్తుగడ మాత్రమే గోచరిస్తోంది.


అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడేందుకు..


అసలు ప్రజలవద్దకే వెళ్లి ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టే కార్యాచరణకు శ్రీకారం చుట్టిందే ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. తన సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ఉమ్మడి రాష్ట్రంలో ఆయన చేపట్టిన సభలూ, వీధి సమావేశాలూ వందలూ వేలు. ఆ తర్వాత ఆయన బాటలోనే తనయుడు జగన్మోహన్ రెడ్డీ ఓదార్పు యాత్ర, ప్రజాసంకల్పయాత్ర పేరిట 14 నెలలపాటు గ్రామ గ్రామాన రోడో షోలు నిర్వహించారు. అప్పుడూ అపశృతులు దొర్లాయి, ప్రమాదాలు జరిగాయి. కానీ ఆ సంఘటనలను అప్పటి ప్రభుత్వాలు అంత సీరియస్ గా తీసుకోలేదు. ఇక పబ్లిక్ మీటింగుల్లో మానవ తప్పిదం వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే నిర్వాహకులను బాధ్యులను చేయడం పరిపాటి. నిన్నటి గుంటూరు ప్రమాదంలోనూ ఉయ్యూరూ ఫౌండేషన్ నిర్వాహకుడు శ్రీనివాస్ పై పోలీసులు కేసుపెట్టి, అరెస్టు చేశారు. కానీ మొత్తంగా రోడ్ షోలనే నిషేధించారంటే ఖచ్చితంగా అది ప్రతిపక్ష నాయకుల యాత్రలు, సభా సమావేశాలపై పరిమితులు విధించి ఇబ్బందులు కలిగించేందుకేనని స్పష్టమౌతోంది.


పిరికిపంద చర్యే కదా....


చంద్రబాబు యాత్రలకు ఇటీవల పెరుగుతున్న ఆదరణే జగన్ ను ఈ అప్రజాస్వామిక ఎత్తుగడ దిశగా పురికొల్పినట్టున్నాయి. 'బాదుడే బాదుడు', 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' సభలకు అంచనాలకు మించిన సంఖ్యలో ప్రజలు హాజరవుతున్నారు. మరోవైపు జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారాహి ప్రచార రధాన్ని సిద్దం చేసుకున్నారు. ఎన్నికల్లోగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తాననీ ప్రకటించారు. అప్పడే జగన్ ప్రభుత్వంలోని పలువురు మంత్రులు అసంబద్ద విమర్శలు చేశారు. అసలు ఆయన వాహనానికి రవాణా శాఖ అనుమతులు లేవనీ.. వారాహిని ఆంధ్రప్రదేశ్లో తిరగనివ్వమనీ స్టేట్మెంట్లు ఇచ్చారు. తెలుగు దేశం పార్టీ జనరల్ సెక్రెటరీ నారా లోకేష్ కూడా యువగళం పేరున జనవరి 27న కుప్పంనుంచి ఇచ్ఛాపురం వరకూ పాదయాత్ర నిర్వహించనున్నారు. ఈ గ్రామస్ధాయి సమావేశాలు, వీధి సభల్లో జగన్ వైఫల్యాలే ప్రధానం లక్ష్యంగా కొనసాగనున్నాయి. వీటిని ఎలా కట్టడి చేయాలని జగన్ ఆలోచిస్తున్న సమయంలోనే కందుకూరు, గుంటూరు ఘటనలు చోటుచేసుకోవడంతో ఇదే అదునుగా రోడ్ షో లపై నిషేదాజ్ఞలు జారీ చేశారని అర్ధమవుతూనే ఉంది.


కుప్పంలో అమల్లోకి ఆంక్షలు..


జగన్ ప్రభుత్వం నిషేదాజ్ఞలు జారీ చేసిందోలేదో అలా పోలీసులు అల్లుకుపోతున్నారు. చంద్రబాబు ఈ నెల 4వ తేదీ నుంచి తన స్వంత నియోజకవర్గం కుప్పంలో యాత్ర చేపట్టనున్నానని ప్రకటించారో లేదో స్ధానిక పోలీసులు తమ అనుమతి లేకుండా ఎలాంటి వీధి సమావేశాలు పెట్టుకోరాదనీ, రోడ్లపై జనం పోగు కాకుండా నిషేదాజ్ఞలున్నాయనీ ప్రకటన విడుదల చేసారు. అంటే ప్రతిపక్షపార్టీలకు కళ్లెం వేసే కార్యక్రమం యుద్ద ప్రాతిపదికన అమల్లోకి వచ్చిందని అర్ధమవుతూనే ఉంది.


ఏమైనా గతంలో అమరావతి రైతుల పాదయాత్రకు పోలీసులు ఇదే విధంగా అనుమతి నిరాకరించారు. అనంతరం హైకోర్టు ద్వారా అన్నదాతలు అనుమతిని సాధించుకున్నారు. ఇప్పుడు అదే రీతిన ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రతిపక్ష పార్టీలు తమ ప్రజాస్వామ్య హక్కుకోసం కోర్టును ఆశ్రయించక తప్పదన్నట్లే కనిపిస్తోంది.

- ప్రదీప్ కుమార్ బోడపట్ల.

ఇన్పుట్ ఎడిటర్, టీవీ-5.

Tags

Read MoreRead Less
Next Story