ఏపీ ప్రజలపై మరో పిడుగు ..!

అసలే సమస్యలతో అల్లాడుతున్న ఏపీ ప్రజలపై మరో పిడుగు పడింది. ఇక నెలనెలా విద్యుత్ సర్దుబాటు ఛార్జీల బాదుడును తట్టుకోవాల్సిందే.. డిస్కమ్‌లు విద్యుత్‌ను కొనుగోలు చేసే మొత్తాన్నీ వినియోగదారుల నుంచే వసూలు చేసుకోవాలని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి- APERC ఆదేశించింది. ఆ విషయంలో వాటికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చేయడంతో పాటు.. కొనుగోలు ధరల నియంత్రణపై పూర్తిగా చేతులెత్తేసింది. విద్యుత్ కొనుగోళ్ల వాస్తవ సమాచారాన్ని ప్రతి ఏటా జూన్ 30 నాటికి డిస్కమ్‌లు తమకు నివేదించాలని.. ఈ సమాచారం అందిన 90 రోజుల్లోగా ట్రూఅప్ లేదా ట్రూడౌన్ చార్జీలపై ఆదేశాలిస్తామని పేర్కొంది. గత నెల 29వ తేదీన కమిషన్ ఇచ్చిన ఈ ఆదేశాలపై ఏపీ సర్కార్ తాజాగా గెజిట్ విడుదల చేసింది. వినియోగదారుల అవసరాల కోసం విద్యుత్ కొనుగోలు చేస్తున్నందున.. ఆ వ్యయాన్ని నెలవారీ బిల్లు నుంచి వసూలు చేసుకోవాలని అందులో స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న టారిఫ్‌కు.. కరెంటు కొనుగోలు ధరకు మధ్య వ్యత్యాసాన్ని ప్రతినెలా డిస్కమ్‌లు వినియోగదారులకు తెలియజేయాలని ఈఆర్‌సీ పేర్కొంది. ఇందుకోసం విస్తృత ప్రచారం చేయాలంది. కొనుగోళ్ల అదనపు భారాన్ని ఒకేసారి వినియోగదారుల నుంచి వసూలు చేయలేనప్పుడు.. యూనిట్‌కు 40 పైసల చొప్పున లెక్కించి నెలవారీ బిల్లుల నుంచి వసూలు చేయాలని తెలిపింది.
విద్యుత్ కొనుగోళ్ల కోసం ఏటా ఎంత వ్యయమవుతుందో డిస్కమ్‌లు ఇదివరకు అంచనా వేసేవి. వాటికి అనుగుణంగా టారిఫ్‌ను ఫిక్స్ చేసుకునేవి. కానీ.. ఇప్పుడు నిర్దేశిత ధరను దాటి ఓపెన్ మార్కెట్‌లో కరెంటు కొనుగోలు చేస్తున్నాయి. ఐతే.. ఏడాది మొత్తానికి ఒకేసారి విద్యుత్ ధరలు పెరిగినట్లుగా చూపిస్తే.. ప్రజల్లో ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతుంది. దాని నుంచి బయటపడేందుకు ప్రతి మూడు నెలలకోసారి సర్దుబాటు పేరిట ట్రూఅప్ చార్జీలను డిస్కమ్‌లు వసూలు చేసేవి. ఇప్పుడు గతంలో కొనుగోలు ధరకూ, ఇప్పుడు కొంటున్న ధరకూ ఏమాత్రం పొంతన లేకుండా పోతోంది. అధిక ధరకు కొనుగోలు చేస్తున్నాయి. దీంతో నెలనెలా జనం నుంచి సర్దుబాబు చార్జీలు వసూలు చేయాలని డిస్కమ్‌లను ఈఆర్‌సీ ఆదేశించింది. ఐతే.. ఏపీఈఆర్‌సీ ధోరణితో విద్యుత్ వినియోగదారులకు స్వేచ్ఛ లేకుండా పోతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో కమిషన్ ప్రజాభిప్రాయాన్ని క్షేత్రస్థాయిలో సేకరించేది. ఇప్పుడు ఆన్‌లైన్ విధానంలో జరుపుతోంది. డిస్కమ్‌లకు పూర్తి సానుకూలంగా వ్యవహరిస్తూ.. వినియోగదారులకు నష్టం వాటిల్లే చర్యలకు దిగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోజంతా నిరాటంకంగా కరెంటు ఇస్తున్నామంటూ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. దీనికి అనుగుణంగా డిస్కమ్‌లు కూడా ఓపెన్ మార్కెట్లో భారీ ధరలకు విద్యుత్ కొంటున్నాయి. ఈ అధిక ధరల భారాన్ని వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com