బెడ్‌రూంలోకి చొరబడి మరీ టీడీపీ మహిళా నేతను అరెస్ట్‌

బెడ్‌రూంలోకి చొరబడి మరీ టీడీపీ మహిళా నేతను అరెస్ట్‌
కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్‌ వద్ద ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ప్రవర్తించిన తీరు సర్వత్రా దుమారం రేపుతోంది

టీడీపీ మహిళా నాయకురాలిపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ‌తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల్సూరి కల్యాణి అరెస్ట్ చేసారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్‌ వద్ద పోలీసులు.. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులు ప్రవర్తించిన తీరు సర్వత్రా దుమారం రేపుతోంది. కల్యాణి ఇంటికి తెల్లవారుజామున ఆమె ఇంటిని చుట్టుముట్టారు. ఆ తర్వాత కల్యాణి బెడ్‌రూమ్‌లోకి చొరబడ్డారు. బలవంతంగా అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. దాంతో కల్యాణి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కనీసం బట్టలు మార్చుకునేందుకు కూడా సమయం ఇవ్వకుండానే లాక్కెళ్లారు.

తెలుగు మహిళా నాయకురాలు మూల్సూరి కల్యాణిని అరెస్టు చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. కల్యాణిపై తప్పుడు కేసులు పెట్టిందే కాక.. బెడ్‌రూమ్‌లోకి చొరబడి ఆమెను ఏదో ఉగ్రవాదిలా అరెస్టు చేసిన విధానం దారుణంగా ఉందని ఫైర్ అయ్యారు. ప్రభుత్వ దుర్మార్గాలను ప్రశ్నించిన మహిళపై హత్యాయత్నం కింద కేసు పెట్టి ప్రతాపం చూపడం సిగ్గుచేటు అని చంద్రబాబు ధ్వజమెత్తారు.

ఫిబ్రవరి 20న గన్నవరంలో టీడీపీ, వైసీపీ మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనలో నమోదైన రెండు కేసుల్లో కల్యాణి నిందితురాలిగా ఉన్నారు. తర్వాత ముందస్తు బెయిల్ రాకపోవడంతో ఇన్నాళ్లు అజ్ఞాతంలోకి వెళ్లారు. అయితే హనుమాన్ జంక్షన్‌లోని తన నివాసంలో ఉన్నట్లు సమాచారం రావడంతో తెల్లవారుజామునే ఇంటిని చుట్టుముట్టి కల్యాణిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై టీడీపీ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story