AP Paper Leak: ఏపీలో కలకలం రేపిన పదోతరగతి ప్రశ్నపత్రం లీక్.. ఆ రెండు జిల్లాల్లోనే..

AP Paper Leak: ఆంధప్రదేశ్ పదో తరగతి పరీక్షల్లో పేపర్ లీక్ వ్యవహారం ఆందోళన కలిగిస్తోంది. బుధవారం పరీక్ష ప్రారంభమైన అరగంటలోపే వాట్సాప్ గ్రూప్‌లో ప్రశ్నాపత్రం ప్రత్యక్షం కావడం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభమైతే 9.57కి వాట్సాప్ గ్రూప్‌లలో క్వశ్చన్ పేపర్ వాట్సాప్ గ్రూప్స్‌లో చక్కర్లు కొట్టింది. ప్రశ్నాపత్రం ఎక్కడి నుంచి లీకైంది. పరీక్ష ప్రారంభానికి ముందే లీక్ చేశారా. అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
చిత్తూరు జిల్లాలో పేపర్ లీక్ అయిన ఘటనపై.. జిల్లా కలెక్టర్‌తోపాటు విద్యా శాఖ స్పందించింది. కొందరు కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు. పరీక్షలు ప్రారంభమైన గంటలోపే వాట్సాప్‌ల్లో వదంతులు తెరలేపారని విద్యా శాఖ అధికారులు వెల్లడించారు. ఇలాంటివి రాష్ట్రంలోనేగాక ఇతర ప్రాంతాల నుంచి లీక్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనిపై జిల్లా ఎస్పీ విచారణ చేస్తున్నారని డీఈవో స్పష్టం చేశారు.
ఇటు కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లెలో పదో తరగతి పేపర్ లీక్ అయ్యింది. కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లెలో టెన్త్‌క్లాస్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయినట్లు గుర్తించారు. పరీక్ష నిర్వహణలో విద్యాశాఖ నిర్లక్ష్యం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎగ్జామినార్, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్, HMపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అటు వాటర్ బాయ్ వచ్చి ఫోటో తీసినట్లు అధికారులు చెబుతున్నా.. ఎగ్జామ్ సెంటర్ ఆవరణలో 144 సెక్షన్ అమల్లో ఉండగా బయటి వ్యక్తులు రావటమేంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
మరోవైపు పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్ ఘటనపై పాఠశాల విద్యాశాఖ స్పందించింది. పరీక్షలు మొదలైన తర్వాత సోషల్ మీడియాలో కొన్ని పేపర్లు వైరల్ అయ్యాయని తెలిపారు. దీనిని లీక్‌గా భావించలేమన్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగానే ఘటనకు పాల్పడినట్లు తెలిపారు. దీనిపై విచారణ చేస్తున్నామని..విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విద్యా శాఖ స్పష్టం చేసింది. అయితే 10వ తరగతి పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే పేపర్ లీక్ కావడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com