Anakapalli : అనకాపల్లిలో 126 అడుగుల భారీ గణపతి

విశాఖపట్నం జిల్లా అనకాపల్లి పట్టణం ఇప్పుడు దేశం చూపును ఆకర్షిస్తోంది. ఇక్కడ 126 అడుగుల భారీ శ్రీ లక్ష్మీ గణపతి విగ్రహం రూపుదిద్దుకుంటోంది. దేశంలోనే అతిపెద్దదైన ఈ విగ్రహం గిన్నిస్ బుక్‌లోకి ఎక్కవచ్చని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ విగ్రహాన్ని ప్రముఖ శిల్పి కామదేను ప్రసాద్ పర్యవేక్షణలో 30 మంది కార్మికులు దాదాపు నెలరోజులుగా తయారు చేశారు. ఈ వినాయకుడి విగ్రహం తయారీకి పది టన్నుల బంక మట్టిని వినియోగించారు. మండపం కోసం 90 టన్నుల సర్వే కర్రను ఉపయోగించారు. వినాయకుని వస్త్రధారణకు వివిధ రకాల రంగులు కలిగిన 150 తానులు వస్త్రం అవసరం అయింది అన్నారు. విగ్రహం మండపం పనులు నేటికి పూర్తి కావచ్చింది వినాయక చవితి రోజున, అంటే ఈ నెల 27వ తేదీన ఉత్సవాలు ఘనంగా ప్రారంభమవుతాయి. వచ్చే నెల 23వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈ కాలంలో రోజుకో సాంస్కృతిక కార్యక్రమం, ఆధ్యాత్మిక పోటీలు నిర్వహిస్తారు. 5,000 మందికి పైగా శ్రీహరి సేన సభ్యులు భక్తుల సేవలో పాల్గొంటారు.
ముఖ్య వివరాలు:
ఉచిత దర్శనం: ప్రతిరోజూ ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు ఉంటుంది.
అన్నదానం: సెప్టెంబర్ 22న 30 వేల మందికి అన్నదానం ఏర్పాటు చేశారు.
నిమజ్జనం: సెప్టెంబర్ 23న విగ్రహం ఏర్పాటు చేసిన వద్దే నిమజ్జనం జరుగుతుంది.
ఈ ఉత్సవాలకు సుమారు 70 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని, దేశవ్యాప్తంగా 20 నుంచి 25 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని నిర్వాహకులు తెలిపారు. కుల, మతాలకు అతీతంగా అందరి సహకారంతో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని కమిటీ కన్వీనర్ బుద్ధ భూలోక నాయుడు పేర్కొన్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com