Durgi Guntur: దుర్గిలో 144 సెక్షన్‌.. ఎన్‌టీఆర్ విగ్రహ ధ్వంసంతో ఉద్రిక్త వాతావరణం..

Durgi Guntur: దుర్గిలో 144 సెక్షన్‌.. ఎన్‌టీఆర్ విగ్రహ ధ్వంసంతో ఉద్రిక్త వాతావరణం..
Durgi Guntur: గుంటూరు జిల్లా దుర్గిలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది.

Durgi Guntur: గుంటూరు జిల్లా దుర్గిలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. మాచర్ల మండలం దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని వైసీపీ నేత ధ్వంసం చేసినందుకు నిరసనగా టీడీపీ శ్రేణులు ఆందోళనకు సిద్ధమయ్యారు. దుర్గిలో బంద్‌కు పిలుపునిచ్చింది టీడీపీ. దీంతో దుర్గిలో పోలీసులు 144 సెక్షన్‌ను విధించారు. టీడీపీ నేతలను ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు.

దుర్గి వెళ్లకుండా నరసరావుపేట టీడీపీ ఇన్‌ఛార్జ్ చదలవాడ అరవింద్ బాబును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మాచర్ల టీడీపీ ఇన్‌ఛార్జ్‌ బ్రహ్మారెడ్డితో సహా నేతలు దుర్గి రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. మాచర్లలో బ్రహ్మారెడ్డి ఇంటి వద్ద పోలీసులను మోహరించారు. దుర్గి వెళ్తుండగా ఒప్పిచర్ల వద్ద బ్రహ్మారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అండదండలతో విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారని బ్రహ్మారెడ్డి ఆరోపించారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే కుర్రి పున్నారెడ్డిని సైతం పోలీసులు హౌస్‌ అరెస్ట్ చేశారు. వైసీపీ నేతలు అచ్చోసిన ఆబోతుల్లా రెచ్చిపోతున్నారంటూ నారా లోకేష్‌ ఫైర్ అయ్యారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు అహంకారంతో హద్దుమీరి ప్రవర్తిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

దుర్గిలో ఎన్టీఆర్‌ విగ్రహ ధ్వంసానికి పాల్పడిన వ్యక్తితో పాటు అందుకు ప్రేరేపించిన వారిపైనా పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దుర్గి మండల జడ్పీటీసీ శెట్టిపల్లి యలమంద కుమారుడు కోటేశ్వరరావు.. బస్టాండ్‌ సెంటర్‌లోని ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించాడు. దీనిపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

విషయం తెలుసుకున్న దుర్గి పోలీసులు.. కోటేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. ఏడాదిన్నర క్రితం కూడా మాచర్లలోని వ్యవసాయ మార్కెట్‌యార్డు వద్ద ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఇప్పుడు దుర్గిలో ఎన్టీఆర్‌ విగ్రహ ధ్వంసానికి ప్రయత్నించారు. దీంతో టీడీపీ నేతలు, కార్యకర్తల్లో ఆగ్రహజ్వాలలు పెరిగాయి. ఎన్టీఆర్‌ విగ్రహంపై దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్టు రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story