Konaseema District: అమలాపురంలో కొనసాగుతున్న 144సెక్షన్.. మళ్లీ సాధారణ పరిస్థితులు..

Konaseema District: అమలాపురంలో కొనసాగుతున్న 144సెక్షన్.. మళ్లీ సాధారణ పరిస్థితులు..
Konaseema District: అమలాపురంలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి.

Konaseema District: అమలాపురంలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. పట్టణంలో 144 సెక్షన్‌ అమలులో ఉండటంతో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటుచేశారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా బలగాలను మోహరించారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన పరీక్షలుకు విద్యార్ధులు హాజరయ్యారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు.

జిల్లా సాధన సమితి నేడు చలో రావులపాలెం నిరసనకు పిలుపునివ్వడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. జిల్లా పేరు మార్పు నిరసనల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో పోలీసులు అమలాపురానికి వచ్చే అన్నిరోడ్లపై తనిఖీలు చేపట్టారు. నిరసనలకు అనుమతి లేదని హెచ్చరించారు. అయితే అమలాపురం పట్టణంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయన్నారు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి.

ఏలూరు రేంజ్‌ డీఐజీ పాల్‌రాజ్ తోపాటు.. కాకినాడ ఎస్పీ రవీంద్రబాబు, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి, ఎన్టీఆర్ జిల్లా ఎస్పీ సిద్దార్థ కౌశల్, గుంటూరు ఎస్పీ విశాల్‌ గుణ్నిలతో జిల్లాల ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ద్వారా మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. నిన్నటి నిరసనల్లో హింసకు పాల్పడిన వారిని గుర్తించి.. 46మందిని అరెస్టుచేసినట్లు తెలిపారు.

బస్సుదగ్దం, మంత్రి ఇళ్లుదగ్దం ఘటల్లో మొత్తం 7 కేసులు నమోదు చేసినట్లు డీజీపీ తెలిపారు. మూడు బస్సులను దగ్దం చేసిన కేసులో నాన్‌బెయిలెబుల్ కేసులు నమోదు చేసినట్లు డీజీపీ వెల్లడించారు. అమలాపురంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని రాజమండ్రి జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి తెలిపారు. జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉందని.. ఎలాంటి ధర్నాలు.. రాస్తారోకోలకు అనుమతి లేదన్నారు.

నిషేధాజ్ఞలు మీరితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 144 సెక్షన్ అమలులో ఉన్నందున ఐదుగురికంటే ఎక్కువ మంది ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు. నిబంధనలు ఎవరు అతిక్రమించవద్దని విజ్ఞప్తిచేశారు. అపోహలు నమ్మవద్దన్నారు. నిన్న నిరసన కారుల హింసలో కాలిపోయిన తన ఇంటిని మంత్రి విశ్వరూప్ పరిశీలించారు.

కుటుంబ సభ్యులతో దగ్దమైన ఇంటిని చూశారు. అంతకుముందు మంత్రి, ఎమ్మెల్యే ఇంటిని ఆర్డీవో పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. ఏలూరు రేంజ్‌ డీ.ఐ.జీ పాల్‌రాజు, మిగతా పోలీసు అధికారులు అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అక్కడ ఎలాంటి ఉద్రిక్తతలు నెలకొనకుండా భారీగా భద్రత చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story