AP DSC Notification : 16,347 టీచర్ పోస్టులు.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

ఏపీలో రాత్రికి రాత్రే అన్ని కార్యక్రమాలు జరిగిపోతాయని చెప్పట్లేదని సీఎం చంద్రబాబు తెలిపారు. గాడితప్పిన వ్యవస్థలను సరిదిద్దుతున్నామనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియగానే 16,347 టీచర్ పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్రప్రసాద్, పేరాబత్తుల రాజశేఖర్‌లను భారీ మెజార్టీతో గెలిపించాలని కూటమి నేతలకు సూచించారు.
కానీ 8 నెలలు అవుతున్నా నోటిఫికేషన్ ఇవ్వకపోగా పలు సాకులతో వాయిదా వేస్తున్నారని ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నెల క్రితమే జిల్లాల్లో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల వివరాలను తెప్పించుకుంది. ఆ వివరాలను కూడా వెల్లడించలేదు. నోటిఫికేషన్‌పై నిరుద్యోగులను ఇన్ని నెలలుగా మభ్యపెట్టి, వాస్తవ పరిస్థితులను వెల్లడించకపోవడంతో అభ్యర్థులు రోడ్డెక్కుతున్నారు.
రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలు, శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 27న ఎన్నికల పోలింగ్ ఉంటుంది. మార్చి 3న ఫలితాలను వెల్లడించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com