Daytime Curfew : ఏపీలో ఇవాళ్టి నుంచి 18 గంటల కర్ఫ్యూ

ఏపీలో నేటి నుంచి 18 గంటల కర్ఫ్యూ అమలుకానుంది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రెండు వారాలపాటు, ప్రతిరోజూ 18 గంటల చొప్పున కర్ఫ్యూను అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ్టి నుంచి ఈనెల 18 వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది. ఆ సమయంలో ఎక్కడా ఐదుగురికి మించి గుమిగూడి ఉండటానికి వీల్లేదు. 144 సెక్షన్‌ను అమలు చేయనున్నారు. వివిధ వ్యాపార, వాణిజ్య సంస్థలు, దుకాణాలు, కార్యాలయాలు, విద్యా సంస్థలు, రెస్టారెంట్లు మూసివేయాలని ఆదేశించారు. అయితే ఆస్పత్రులు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసే ల్యాబ్‌లు, ఔషధ దుకాణాలతోపాటు కొన్ని అత్యవసర సేవలకు ప్రభుత్వం మినహాయింపునిచ్చింది.
కర్ఫ్యూ నిబంధనలు, అనుసరించాల్సిన విధివిధానాలపై వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ముహుర్తాలు నిర్ణయించుకుని, వాటిని వాయిదా వేసుకోలేని పరిస్థితుల్లో నిర్వహించే వివాహాది వేడుకలకు 20 మందికి మించి హాజరుకాకూడదని స్పష్టంచేశారు. అది కూడా స్థానిక అధికారుల నుంచి ముందస్తు అనుమతితో, కొవిడ్ నిబంధనల్ని పాటిస్తూ నిర్వహించుకోవాలి. ప్రభుత్వం మినహాయింపునిచ్చిన అత్యవసర విభాగాలు, సేవల రంగాల్లో పనిచేస్తున్నవారు తప్ప... మిగతా వ్యక్తులెవరు కర్ఫ్యూ సమయంలో బయట తిరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు. వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ సహా.... వ్యవసాయ రంగానికి సంబంధించిన కార్యకలాపాలన్నీ... వ్యవసాయశాఖ జారీ చేసే కొవిడ్ మార్గదర్శకాలను అనుసరించి నిర్వహించుకునేందుకు అనుమతిచ్చారు. తయారీ రంగానికి చెందిన పరిశ్రమలకూ మినహాయింపునిచ్చారు.
కర్ఫ్యూని తక్షణం అమలు చేసేందుకు వీలుగా... అన్ని ప్రభుత్వ విభాగాలు, పోలీసు కమిషనర్లు, జిల్లా కలెక్టర్లు ఆదేశాలు, నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. మినహాయింపునిచ్చిన కేటగిరీలకు చెందిన వారికి పాస్‌లను జారీ చేయాలని ఆదేశించింది. నిబంధనల్ని ఉల్లంఘించిన వారిపై విపత్తు నిర్వహణ చట్టంలోని 51, 60 సెక్షన్లు, ఐపీసీ సెక్షన్ 188తోపాటు దీనికి వర్తించే ఇతర చట్టాల్ని అనుసరించి ప్రాసిక్యూట్ చేస్తామని హెచ్చరించింది. కర్ఫ్యూలేని సమయంలో 144 సెక్షన్‌ని పక్కాగా అమలు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఇక మద్యం దుకాణాల వేళలు మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచాలని ఆదేశించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com