పాపం చిన్నారి.. జామకాయ ముక్క గొంతులో ఇరుక్కోవడంతో..

చిన్న ముక్కే కదా అని చిన్నారి చేతికి జామ కాయ ముక్క ఇచ్చారు. అది కాస్తా గొంతుకి అడ్డం పడి 8 నెలల పసిబిడ్డ ప్రాణాలు తీసింది. అడుగులైనా వేయలేదు.. అప్పుడే నూరేళ్లు నిండిపోయాయా బిడ్డా అని అమ్మా, అమ్మమ్మా కన్నీరు మున్నీరవుతున్నారు. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం పాగోలు శివారు లంకతోటకు చెందిన వీర్ల వెంకటేశ్వరరావు కుమార్తెకు కవల ఆడపిల్లలు జన్మించారు. లంకతోటలోని అమ్మమ్మ ఇంట్లో పిల్లలు ఇద్దరూ ఉన్నారు. వారిలో ఒక పాప వీక్షిత జామకాయ ముక్కను నోట్లో పెట్టుకుని మింగే ప్రయత్నం చేసింది.
పాపం చిన్నారి గొంతులో ఇరుక్కుపోయిన జామకాయ ముక్కతో బిడ్డకు ఊపిరాడలేదు. అమ్మమ్మ కంగారుపడిపోయి దాన్ని బయటకు తీసే ప్రయత్నం చేసినా రాలేదు. వెంటనే దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తీస్కెళ్లారు. కానీ వైద్యులు చేసిన ప్రయత్నం కూడా ఫలించక చిన్నారి ప్రాణాలు విడిచింది. అప్పటి వరకు చిరునవ్వులు చిందించిన చిన్నారి ప్రాణాలు కోల్పోవడం కుటుంబసభ్యులను కలచి వేసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com