శివరామకృష్ణ..ఓ అవినీతి పుట్ట..

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ అవినీతి పుట్టను బద్ధలు కొట్టిన ఏసీబీ అధికారులు. రెండో రోజు తనిఖీలు కొనసాగిస్తున్నారు. నిన్న భీమవరం సహా పలుచోట్ల తనిఖీలు చేపట్టిన అధికారులు ఇవాళ విజయవాడలోని ఓ ఇల్లు, బ్యాంకులోని ఓ లాకర్‌ను తెరవనున్నారు. ఇప్పటికే దాదాపు 60కోట్ల మేర అక్రమాస్తులు గుర్తించిన ఏసీబీ అధికారులు విజయవాడలోని ఇల్లు, బ్యాంక్ లాకర్ తెరిస్తే మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశం ఉందన్నారు.
కమిషనర్ హోదా మాటున శివరామకృష్ణ 60కోట్ల మేర అక్రమాస్తులు పోగేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. భీమవరంలోని శివరామకృష్ణ ఇల్లు సహా పలుచోట్ల ఏసీబీ అధికారులు ఏక కాలంలో సోదాలు చేశారు. తనిఖీల్లో కళ్లు తిరిగేంత డబ్బు, బంగారం, ఆస్తుల డాక్యుమెంట్లు బయటపడ్డాయి. తణుకులో రెండు ఇళ్లు, పాలకొల్లులో ఇల్లు, మూడున్నర ఎకరాల పొలం, ఖాళీ స్థలం, భీమవరంలో ఒక ఇల్లు, విజయవాడలో మూడు ఫ్లాట్లు, నాలుగు కార్లు, రెండు బైక్‌లకు సంబంధించిన డాక్యుమెంట్లు గుర్తించారు. అలాగే 20లక్షల 67వేల 700రూపాయల నగదు, 690 గ్రాముల బంగారంతో పాటు 2.5కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు.
భీమవరం మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణపై అవినీతి ఆరోపణలు వెత్తడంతో ఏసీబీ అధికారులు ఈ తనిఖీలు నిర్వహించారు. మురికి కాల్వల నిర్మాణం మొదలు రోడ్డుపై చెత్త తీయించే కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు వరకు ప్రతీ దానిలో అవినీతికి పాల్పడినట్లు ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందాయి. చేసే ప్రతీ పనిలో 2శాతం కమీషన్ ఇవ్వందే చెక్కులు ఇవ్వరని శివరామకృష్ణపై ఆరోపణలు ఉన్నాయి. పురపాలక శాఖలో సాధారణ ఉద్యోగిగా చేరి ప్రస్తుతం భీమవరం మున్సిపల్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న సబ్బి శివరామకృష్ణ అవినీతిపై ఏసీబీ కాల్‌సెంటర్ 14400, ఏసీబీ యాప్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
శివరామకృష్ణ అవినీతిపై పక్కా సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు ఏకకాలంలో 9చోట్ల సోదాలు చేపట్టారు. 9టీమ్స్‌గా విడిపోయి భీమవరం, పాలకొల్లు, బాపట్ల, తణుకు, విజయవాడలో ఆయన బంధువుల ఇళ్లపై దాడులు చేశారు. ఇవాళ, రేపు కూడా సోదాలు కొనసాగుతాయిని ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com