AP: ఎన్టీఆర్ జిల్లాలో క్వారీ ప్రమాదం.. ముగ్గురు మృతి
ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ క్వారీలో పనిచేస్తున్న కార్మికులపైన బండరాళ్లు పడ్డాయి. దీంతో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురు కార్మికుల ఆచూకీ దొరకడంలేదని అధికారులు చెప్పారు. గల్లంతైన కార్మికుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వివరించారు. కంచికచర్ల మండలం పరిటాల క్వారీలో సోమవారం మధ్యాహ్నం ఈ ఘోరం చోటుచేసుకుంది. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నట్లు పోలీసులు తెలిపారు. కార్మికులు ముగ్గురూ బండరాళ్ల కింద చిక్కుకుపోయి ఉంటారని అన్నారు. వారిని క్షేమంగా బయటకు తెచ్చేందుకు రెస్క్యూ సిబ్బంది శ్రమిస్తున్నారని పేర్కొన్నారు.
రోజులాగానే సోమవారం ఉదయం కొంతమంది కార్మికులు క్వారీలో డ్రిల్లింగ్ పనులు చేస్తుండగా ఒక్కసారిగా బండరాళ్లు వాళ్లపై పడిపోయాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్ లోనే చనిపోయారు. తోటి కార్మికులు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. కాగా, మృతులు ముగ్గురూ జి.కొండూరు మండలం చెరువు మాధవరం వాసులుగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com