AP: పోసాని కృష్ణమురళి అరెస్ట్

ప్రముఖ నటుడు, వైసీపీ సానుభూతిపరుడు పోసాని కృష్ణ మురళిని... ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, విద్యాశాఖ మంతచ్రి నారా లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో పోసానిని అరెస్ట్ చేశారు. అన్నమయ్య జిల్లా ఓబుళవారిపల్లె పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని మైహోం భూజా అపార్ట్‌మెంట్‌లో ఉన్న పోసాని కృష్ణ మురళి నివాసానికి వెళ్లి... నోటీసులు అందించిన పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. అన్నమయ్య జిల్లా సంబేపల్లె ఎస్‌ఐ భక్తవత్సలం ఆధ్వర్యంలో నలుగురు పోలీసులు హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీసులను కలిసి... పోసాని కృష్ణ మురళిపై నమోదైన కేసు వివరాలను అందించారు. ఆయన అరెస్టుకు ఎస్కార్ట్ కల్పించాలని కోరారు. దీంతో... రాయదుర్గం ఠాణా నుంచి ఒక ఎస్‌ఐ, ఒక కానిస్టేబుల్ ఏపీ పోలీసులకు తోడుగా వెళ్లారు. రాత్రి 8.45 గంటల సమయంలో మైహోం భూజాలోని పోసాని నివాసానికి వెళ్లి, ఆయనను అరెస్టు చేశారు. ఆయనను నేడు రాజంపేట కోర్టులో హాజరుపరిచే అవకాశముంది.
పోలీసులతో వాగ్వాదం
పోసాని అరెస్టు సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసులతో పోసాని వాగ్వాదానికి దిగారు. రాత్రి వేళలో వచ్చి పోలీసులం అని చెబితే ఎలా నమ్మేది అని అన్నారు. అసలు అనుమతి లేకుండా తన ఇంటికి ఎలా వచ్చారని ప్రశ్నించారు. దీనికి పోలీసులు కూడా ఘాటుగా స్పందించారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడికైనా వెళ్లొచ్చని అరెస్టు చేయవచ్చని అన్నారు. మీ ఫ్యామిలీ మెంబర్స్‌కు రమ్మని చెప్పండి.. మిమ్మల్ని అరెస్టు చేస్తున్నామని పోలీసులు తెగేసి చెప్పారు. లేకుంటే వేరేలా తీసుకెళ్లాల్సి ఉంటుందని చెప్పేశారు.
పోసాని విజ్ఞప్తిని పట్టించుకోని పోలీసులు
చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడులను ఉద్దేశించి పోసాని కృష్ణ మురళి కించపరిచేలా మాట్లాడారంటూ అనేక ఫిర్యాదులు వచ్చాయి. దీంతో పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అనారోగ్యం కారణంగా తాను పోలీసులతో రాలేనని చెప్పినా వినకుండా పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకుని ఏపీ తరలిస్తున్నట్లు సమాచారం. గత ఏపీ ఎన్నికల సమయంలో పోసాని.. వైసీపీకి మద్దతు పలికారు.
నోటికొచ్చినట్లు తిట్టిన పోసాని
వైసీపీ అధికారంలో ఉండగా... టీడీపీ, జనసేన అగ్రనేతలపై పిచ్చిపిచ్చిగా రెచ్చిపోయి, అడ్డూ అదుపూ లేకుండా నోరు పారేసుకున్న సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని పోలీసులు అరెస్టు చేశారు. పోసాని వైసీపీ సభ్యత్వం తీసుకోకపోయనా ఆ పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించారు. అందుకే జగన్ గెలిచినల తర్వాత పోసానిని ఫిల్మ్‌డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా చేశారు. పదవి వచ్చినప్పటి నుంచి మరింతగా రెచ్చిపోయారు పోసాని. చంద్రబాబు, పవన్, లోకేష్‌ను ఇష్టారీతిన తిట్టడంతో టీడీపీ, జనసేన కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కేసులు పెట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com