AP Endowment Dept: ఏపీ దేవాదాయశాఖలో అవకతవకలు.. నిధుల దుర్వినియోగం..

AP Endowment Dept: ఏపీ దేవాదాయశాఖలో కామన్ గుడ్ ఫండ్ పక్కదారి పడుతోందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కేవలం దేవాలయాల పునరుద్దరణ, మౌలిక వసతులకు మాత్రమే కామన్ గుడ్ ఫండ్ వినియోగించాలి. కాని, కొంతకాలంగా అధికారులు, పాలకులు.. ఈ సీజీఎఫ్ నిధులను విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీజీఎఫ్ నిధులు అయిపోవడంతో.. దేవాలయాల ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఎన్‌క్యాష్ చేసి మరీ సీజీఎఫ్ బకాయిలు వసూలు చేశారనే ప్రచారం జరుగుతోంది. దేవదాయ శాఖ అధికారులు.. చట్టబద్ద చెల్లింపులను చట్టవిరుద్దంగా వినియోగిస్తున్నారన్న విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి.
దేవదాయశాఖ సలహాదారుకు సైతం సీజీఎఫ్ నుంచే జీతభత్యాలు అనే ప్రచారం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కామన్ గుడ్ ఫండ్‌ను పలు అనధికార కార్యక్రమాలకు వినియోగిస్తున్నారని దేవదాయ శాఖలోని కొందరు ఉద్యోగులు సైతం ఆరోపిస్తున్నారు. ఇప్పటికే నిబంధనలకు విరుద్ధంగా సీజీఎఫ్ నుంచి చెల్లింపులు జరిగాయంటున్నారు. చివరికి దేవదాయశాఖ సలహాదారుకు సైతం సీజీఎఫ్ నుంచి జీతభత్యాలు చెల్లిస్తున్నారని చెబుతున్నారు. అసలు దేవదాయశాఖకు సలహాదారు నియామకంపైనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దేవదాయశాఖ సలహాదారు ఎవరికి సలహాలు ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. అసలు ఈ సలహాదారు అర్హత ఏంటని నిలదీస్తున్నారు దేవదాయ శాఖ సిబ్బంది. ఏపీలోని దేవదాయ శాఖ రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లక్షల రూపాయల జీతాలను సీజీఎఫ్ నుంచి దోచుకునేందుకు పక్కా ప్రణాళిక అమలవుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
చివరికి దేవాలయాల ఫిక్స్‌డ్ డిపాజిట్ల విత్‌డ్రా చేసి మరీ రాజకీయ నిరుద్యోగులకు జీతాలివ్వడమేంటనే ప్రశ్న వినిపిస్తోంది. దేవాలయాల మౌలిక వసతుల కన్నా రాజకీయ నిరుద్యోగులకే పెద్దపీట వేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ఏపీలో మంచినీళ్లు, బాత్‌రూమ్స్ కూడా లేని దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. వాటికి ఇవ్వాల్సిన నిధులను సలహాదారుల జీతాలకు ఇవ్వడమేంటని విమర్శిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com