అమరావతి ఉవ్వెత్తున ఎగసిపడుతోన్న ఉద్యమం.. 29 గ్రామాల్లో ఆందోళనలు

అమరావతి ఉవ్వెత్తున ఎగసిపడుతోన్న ఉద్యమం.. 29 గ్రామాల్లో ఆందోళనలు
X
అమరావతి ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది.. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో ఆందోళనలు కొనసాగిస్తున్నారు రైతులు, మహిళలు. తాజాగా దొండపాడులో దీక్షా శిబిరం ప్రారంభించారు..

అమరావతి ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది.. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో ఆందోళనలు కొనసాగిస్తున్నారు రైతులు, మహిళలు. తాజాగా దొండపాడులో దీక్షా శిబిరం ప్రారంభించారు. రాజధానిగా అమరావతే కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటించే వరు ఆందోళనలు విరమించే ప్రసక్తే లేదంటున్నారు.. తాజాగా రాజధానిగా అమరావతినే కొనసాగించేలా పార్లమెంట్‌లో ప్రకటన చేయాలంటూ ప్రధాని మోదీకి రాజధాని ప్రాంత రైతులు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వ వేధింపులు ఆగేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని మందడం గ్రామానికి రైతులు, మహిళలు ప్రధానికి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ పేరుతో కుట్ర చేస్తున్నారని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. కుటుంబ అవసరాల కోసం భూములు అమ్ముకున్నా.. సిట్, సీఐడి, సబ్‌కమిటీ పేర్లతో వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయబద్ధంగా చేసుకున్న ఒప్పందాన్ని ప్రభుత్వం గౌరవించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

అమరావతిపై ఆక్రోశం వెళ్లగక్కే నాయకులతో సబ్‌కమిటీ ఏర్పాటు చేసి రాజధానిపై బురద చల్లుతున్నారని ప్రధానికి రైతులు ఫిర్యాదు చేశారు. 2014 జూన్‌ 2 నుంచి రాజధానిపై ప్రకటన వరకు అమరావతిలో క్రయవిక్రయాలు జరిగింది 128 ఎకరాలు మాత్రమేనన్నారు. పేద రైతులు తమ పిల్లల చదువులు, పెళ్లిళ్ల కోసం భూములు అమ్మినా ఇన్‌సైడ్ ట్రేడింగ్‌ కిందే లెక్కేసి మాట్లాడుతున్నారని పీఎంకు ఫిర్యాదు చేశారు. ఏపీలో పేదలకు ఇళ్ల స్థలాల మాటున రాష్ట్రంలో పెద్ద ఎత్తున వన్‌ సైడ్‌ట్రేడింగ్ జరుగుతోందని రాజధాని రైతులు, మహిళలు ఆరోపిస్తున్నారు. ఆ స్కామ్‌ నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే తమపై ఆరోపణలు చేస్తున్నారని ఫైరవుతున్నారు. కేంద్రం జోక్యం చేసుకుని రాజధానిని పరిరక్షించాలని, తమ హక్కులు కాపాడాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తంగా రోజుకో వినూత్న కార్యక్రమంతో అమరావతి రైతుల ఉద్యమం కొనసాగుతోంది.. వైసీపీ ప్రభుత్వం మాట తప్పిందంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Next Story