Tirupati: తిరుపతిలో రాజధాని రైతుల మహోద్యమ సభ

Tirupati: అమరావతే ఆశ.. శ్వాసగా అద్వితీయంగా సాగిన మహాపాదయాత్రకు ముగింపుగా ఇవాళ తిరుపతిలో రాజధాని రైతుల మహోద్యమ సభ జరగబోతోంది. ఈ సభకు అన్ని రాజకీయ పార్టీల నేతలను ఆహ్వానించారు. ప్రజా, రైతు, వర్తక, వాణిజ్య సంఘాల్ని ఆహ్వానించింది అమరావతి జేఏసీ. మహోద్యమ సభకు హాజరై.. టీడీపీ అధినేత చంద్రబాబు సహా వివిధ పార్టీల నేతలు సంఘీభావం తెలపనున్నారు.
ఇవాళ్టి సభ కోసం 20 ఎకరాలకు పైగా స్థలంలో పక్కాగా ఏర్పాట్లు చేశారు. 30 నుంచి 40 వేల మంది వచ్చినా ఇబ్బంది లేకుండా సభాప్రాంగణంలో ఏర్పాట్లు జరిగాయి. 4 జిల్లాలు.. 45 రోజులు.. 438 కిలోమీటర్ల మేర.. అడుగడుగునా ఆంక్షలు విధించినా, ఆటంకాలు కల్పించినా దాటుకుని అమరావతి రైతుల మహా పాదయాత్ర నభూతో.. నభవిష్యత్ అన్నట్లు సాగింది.
ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని నినాదంతో కొనసాగుతున్న ఈ అపూర్వ ఉద్యమానికి రాష్ట్రంలోని 3 ప్రాంతాల నుంచి భారీగా మద్దతు లభిస్తోంది. అభివృద్ధి నినాదంతో అమరావతికే అన్ని ప్రాంతాల ప్రజలు జైకొడుతున్నారు.
రాయలసీమలో అమరావతి పాదయాత్రకు జననీరాజనం పలకడమే ఇందుకు నిదర్శనం. అటు.. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకూ సభ జరగుంది. ఐతే.. టీడీపీ నేతలు సభకు హాజరుకాకుండా పోలీసులు ఎక్కడికక్కడ ఆంక్షలు విధిస్తున్నారు. జిల్లాల నుంచి వస్తున్న నేతల గృహనిర్బంధాలతో పలుచోట్ల ఉద్రిక్తతలు తలెత్తాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com