Andhra Pradesh: ఇప్పుడు అమరావతి పాఠాన్ని తీసేశారు.. భవిష్యత్తులో...

Andhra Pradesh: ఏపీలో అమరావతి అనేదే కనిపించకుండా చేస్తున్నారా? భావి తరాలకు అమరావతి అనేది ఒకటి ఉందని తెలియకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారా? ఇప్పటికే అమరావతి నిర్మాణాన్ని ఆపేశారు. ఏకైక రాజధానిగా అమరావతి ఉండబోదన్నారు. ఇప్పుడు ఏపీ రాజధానిగా రూపుదిద్దుకుంటున్న అమరావతి పాఠాన్ని సైతం పాఠ్యాంశం నుంచి తొలగించారు.
నిన్నటి వరకు అమరావతి పాఠం పదో తరగతి తెలుగు సబ్జెక్ట్‌లో ఉండేది. ఈ విద్యా సంవత్సరం నుంచి దాన్ని తొలగించారు. కొత్తగా ముద్రించిన పుస్తకాలను పాఠశాల విద్యాశాఖ స్కూళ్లకు సరఫరా చేసింది. వాటిలో అమరావతి పాఠ్యాంశమే లేదు. అమరావతి పాఠ్యాంశంలో కేవలం కొత్త రాజధాని గురించే కాదు.. ఒకప్పటి సాంస్కృతిక వైభవం కూడా ఉంటుంది.
అమరావతికి సంబంధించిన పూర్వ చరిత్రలు, ఇతివృత్తాలు సైతం ఉంటాయి. దాంతో పాటు విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి ఎంపిక, భూ సేకరణ, అందులో ఉండే విశేషాలు, జరుగుతున్న నిర్మాణాలు ఇలా అన్నింటినీ సమ్మిళితం చేసి పాఠ్యాంశంగా చేర్చారు. 2014లో 12 పాఠాలతో పదో తరగతి తెలుగు పాఠ్య పుస్తకం ముద్రించారు. సాంస్కృతిక వైభవం ఇతివృత్తం కింద రెండో పాఠంగా అమరావతి ఉండేది.
తాజాగా పాఠశాల విద్యాశాఖ దాన్ని తొలగించి 11 పాఠాలతోనే పుస్తకాలు ముద్రించింది. భావితరాలకు అమరావతి అనేది వినిపించకూడదనేదే ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది. ఎందుకంటే, విద్యార్థుల నుంచి పాత తెలుగు పుస్తకాలను సైతం తీసేసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించినట్టు తెలుస్తోంది. పాత పుస్తకాలు తీసుకుని కొత్త వాటిని అందించాలని టీచర్లకు చెప్పినట్టు మాట్లాడుకుంటున్నారు.
అయితే, పాత పుస్తకాల ప్రకారమే ఇప్పటి వరకు క్లాసులు జరిగాయి. వాటిలో అమరావతి పాఠాన్ని ఇప్పటికే బోధించేశారు ఉపాధ్యాయులు. ఇక మీదట.. అంటే వచ్చే విద్యా సంవత్సరం పదో తరగతిలోకి వచ్చే విద్యార్ధులకు ఇక అమరావతి అనే పాఠమే కనిపించదన్న మాట.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com