Amaravati Lands: రూ.3వేల కోట్ల అప్పు కోసం అమరావతి భూములు తాకట్టు..?

Amaravati Lands: రూ.3వేల కోట్ల అప్పు కోసం అమరావతి భూములు తాకట్టు..?
Amaravati Lands: అమరావతి కోసం రైతులు ఇచ్చిన భూముల్లో 480 ఎకరాలు మాయం అయినట్టేనా?

Amaravati Lands: అమరావతి కోసం రైతులు ఇచ్చిన భూముల్లో 480 ఎకరాలు మాయం అయినట్టేనా? సీఆర్‌డీఏ కింద ఉన్న 480 ఎకరాల భూములు తాకట్టు కింద వెళ్లిపోయాయా? అప్పుల కోసం అర్రులు చాస్తున్న జగన్ ప్రభుత్వం.. అమరావతి భూములను తాకట్టు పెట్టి రుణం తీసుకుందా? లేక గతంలో హడ్కో రుణం కోసం తనఖా పెట్టిన భూమిని ఎంఐజీ స్మార్ట్‌ టౌన్‌షిప్‌కు ఇచ్చినందున.. దాన్ని విడిపించేందుకు ఈ 480 ఎకరాల భూమిని తనఖా పెట్టిందా?

అధికారులెవరూ ఫుల్ క్లారిటీ ఇవ్వనప్పటికీ.. రిజిస్ట్రేషన్‌ జరిగింది వాస్తవమేనని రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు చెబుతున్నారు. రాజధాని నిర్మాణం కోసం సీఆర్‌డీఏకు హడ్కో ఒక వేయి 250 కోట్ల అప్పు ఇచ్చింది. ఈ రుణానికి మంగళగిరి సమీపంలోని నవులూరులో లేఔట్లు వేసేందుకు సేకరించిన భూమిని తాకట్టు పెట్టారు. ఆ భూముల్లో మధ్యతరగతి వారి కోసం ఎంఐజీ లేఔట్‌ను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది.

ఆ భూమిని తనఖా నుంచి విడిపించాలంటే హడ్కో నుంచి తీసుకున్న అప్పు తీర్చాలి, లేదా ప్రత్నామ్నాయంగా మరో భూమిని తాకట్టు పెట్టాలి. కొంతమంది అధికారులు చెబుతున్న దాని ప్రకారం.. ఆ 480 ఎకరాల భూములను హడ్కోకే రిజిస్ట్రేషన్‌ చేసి ఉండొచ్చని కూడా అంటున్నారు. మందడంలోని సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసులో తనఖా రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసినట్టు తెలుస్తోంది.

నిజానికి ఈ రిజిస్ట్రేషన్‌ జరిగిన రోజు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులంతా పెన్‌డౌన్‌ చేశారు. కాని, సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్ ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చి మరీ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేయించినట్టు మాట్లాడుకుంటున్నారు. బ్యాంకులకు తనఖా పెట్టిన 480 ఎకరాల్లో.. అనంతవరం, మందడం, ఉద్ధండరాయునిపాలెం, లింగాయపాలెం, వెంకటపాలెం గ్రామాల రైతులు అమరావతి కోసం ఇచ్చిన భూములు ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ భూములను బ్యాంకులకు తనఖా పెట్టి 3వేల కోట్ల రూపాయల అప్పు తీసుకుంటున్నారని చెబుతున్నప్పటికీ.. ఏ బ్యాంకులకు కుదవ పెట్టారు, దేనికి ఖర్చుపెట్టడానికి తీసుకుంటున్నారన్న విషయాలపై మాత్రం స్పష్టత లేదు. కాని, తనఖా పెట్టింది మాత్రం వాస్తవమేనని చెబుతూ.. అందుకు కొన్ని సాక్ష్యాలు కూడా చెబుతున్నారు. బ్యాంకులకు తనఖా పెట్టిన భూముల్లో సర్వేచేసి మార్కింగ్‌ కూడా చేశారని అంటున్నారు.

పైగా కొన్నిరోజుల క్రితం గుంటూరు జాయింట్‌ కలెక్టర్‌.. రాజధానిలోని భూముల రిజిస్ట్రేషన్‌ విలువ, బహిరంగ మార్కెట్‌ విలువల వివరాలను రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారుల నుంచి తెప్పించుకున్నట్టు చెబుతున్నారు. నిజానికి రాజధానిలో నిర్మాణాల కొనసాగింపు కోసం 3వేల కోట్లు అప్పు తెచ్చుకోవాలని ఏడాదిన్నర క్రితమే ప్రభుత్వం చెప్పింది. దీనికి సంబంధించి సీఆర్‌డీఏ ఒక డీపీఆర్‌ సిద్ధం చేయించి జనవరి 9న ప్రభుత్వానికి ఓ ప్రతిపాదన పంపింది.

ఈ డీపీఆర్ ప్రకారం బ్యాంకుల నుంచి 3 వేల కోట్ల రుణం తీసుకుంటామని తెలిపింది. డీపీఆర్ ప్రకారం రుణం తీసుకున్న మూడో ఏడాది నుంచి రాజధానిలోని 481 ఎకరాలను దశలవారీగా 15 ఏళ్ల పాటు అమ్మి.. తీసుకున్న రుణాన్ని తీర్చేయాల్సి ఉంటుంది. మూడో ఏడాదిలో రాజధానిలో భూమి విలువ ఎకరం 7 కోట్లు ఉంటుందని, 17వ సంవత్సరంలో ఎకరం విలువ సుమారు 17 కోట్ల 74 లక్షలకు చేరుతుందని డీపీఆర్‌లో అంచనా వేసి చూపించారు.

బ్యాంకుల నుంచి ఆ 3వేల కోట్ల రుణం తీసుకునేందుకు సీఆర్‌డీఏకు గ్యారంటీనిస్తూ ప్రభుత్వం సైతం జీవో ఇచ్చింది. ఇప్పుడు ఈ 3 వేల కోట్ల రుణానికే సీఆర్‌డీఏ భూమి తనఖా పెట్టిందా? మరో దానికా అన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ రుణం తీసుకుంటున్నది నిజమే అయితే.. ఆ డబ్బును అమరావతి నిర్మాణానికి వాడతారా, మరేదైనా అవసరానికి వినియోగిస్తారా అన్నది కూడా తేలాల్సి ఉంది.

Tags

Read MoreRead Less
Next Story