Amaravati: అమరావతి ఉద్యమానికి నేటితో 900 రోజులు.. బిల్డ్ అమరావతి నినాదంతో..

Amaravati: అమరావతి ఉద్యమానికి నేటితో 900 రోజులు.. బిల్డ్ అమరావతి నినాదంతో..
X
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలనే ఉద్యమం మొదలై నేటికి 900 రోజులు.

Amaravati: ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలనే ఉద్యమం మొదలై నేటికి 900 రోజులు. హైకోర్టు తీర్పు తర్వాత పంథా మార్చుకున్న రాజధాని రైతులు.. బిల్డ్ అమరావతి నినాదంతో కదంతొక్కుతున్నారు. హైకోర్టు తీర్పును ప్రభుత్వం అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఉద్యమానికి 900 రోజులవుతున్న సందర్భంగా ఈ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు మందడం శిబిరంలో నివాళులు అర్పించారు.

న్యాయదేవత, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. రాజ్యాంగం, సీఆర్డీఏ చట్టానికి పూజా కార్యక్రమం, న్యాయస్థానాల తీర్పు నేపథ్యంలో రాజధాని అభివృద్ధి అంశంపై వక్తల సందేశం వంటి కార్యక్రమాలు రూపొంందించింది అమరావతి జేఏసీ. రాష్ట్ర రాజధాని కోసం భూములిచ్చి, రాష్ట్ర భవిష్యత్‌ కోసం త్యాగం చేస్తే.. తిరిగి అదే రైతులపై దమనకాండ ప్రదర్శించడంపై రాజధాని ప్రాంత రైతులు తిరగబడుతున్నారు.

ప్రభుత్వం దిగి వచ్చే వరకూ ఉద్యమాన్ని ఆపేది లేదంటున్నారు అమరావతి రైతులు. కోర్టు తీర్పును అమలు చేసి, రాజధాని నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రపంచ చరిత్రలో రైతులు కొనసాగిస్తున్న ఇంత సుదీర్ఘ ఉద్యమం మరొకటి లేదు. రాష్ట్రానికి మూడు రాజధానులు అంటూ 2019 డిసెంబర్‌ 19న జగన్‌ ప్రకటన చేసిన రోజు నుంచి మొదలైందీ ఉద్యమం. న్యాయం కోసం సచివాలయం వెళ్లినా కొట్టారు, గుడికి వెళ్లినా కొట్టారు.

రైతులని చూడలేదు, ఆడవాళ్లపైనా దాష్టీకాలు ఆపలేదు. నిరసన చేస్తుంటే నిర్బంధించారు. గొంతెత్తితే కేసులు పెట్టారు. అత్యంత శాంతియుతంగా సాగుతున్న ఉద్యమంలో.. రైతులు, మహిళలు, వృద్ధులతో కంటతడి పెట్టించారు. రాజధాని రాదేమోనన్న ఆందోళన, భయం, బెంగతో ఓవైపు ప్రాణాలు పోతున్నా సరే.. గుండె నిబ్బరంతో ఉద్యమాన్ని అలాగే కొనసాగించారు రైతులు. 2020 జనవరి 5న తుళ్లూరు నుంచి మందడం వరకు సాగిన 29 గ్రామాల రైతుల పాదయాత్రతో ఉద్యమం ఊపందుకుంది. అదే సమయంలో ఇంద్రకీలాద్రిలో ముడుపులు చెల్లించేందుకు బయల్దేరిన మహిళలపై పోలీసులు లాఠీచార్జి చేశారు.

దీంతో రైతులు, మహిళలు హైవే దిగ్బంధించారు, చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. సరిగ్గా అదే సమయంలో కరోనా వచ్చి, లాక్‌డౌన్‌ పెట్టినా సరే రైతులు, మహిళలు వెనక్కి తగ్గలేదు. ఇళ్లల్లోనే ఉద్యమం నడిపారు. అమరావతిలోనో, రాష్ట్రంలోనో కాదు ప్రపంచవ్యాప్తంగా 250 పట్టణాల్లో సంఘీభావ కార్యక్రమాలు చేపట్టారు. నారీ-సమరభేరి, రైతు భేరి, న్యాయస్థానం టూ దేవస్థానం పేరుతో హైకోర్టు నుంచి తిరుపతికి సుదీర్ఘ పాదయాత్ర ఇలా వరుస కార్యక్రమాలు చేపడుతూ ఉద్యమాన్ని రగిలిస్తూనే ఉన్నారు రైతులు.

Tags

Next Story